ప్రభుత్వం ఈ20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్+ 80 శాతం పెట్రోల్) వినియోగాన్ని వేగంగా పెంచుతోంది. దేశం తన ఈ20 లక్ష్యాన్ని ముందుగానే చేరుకోవడంతో, ఈ ఇంధనం ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. అయితే వాహన యజమానుల్లో 'E20 పెట్రోల్ వాడితే ఇంజిన్‌కు నష్టం జరుగుతుందా?' అనే అనుమానం మాత్రం అలాగే ఉంది.
నిపుణుల ప్రకారం.. అన్ని వాహనాలకు ఈ20 పెట్రోల్ హానికరం కాదు. ముఖ్యంగా ఏప్రిల్ 2023 తర్వాత తయారైన వాహనాలు ఇప్పటికే ఈ20 ఇంధనానికి అనుగుణంగా తయారయ్యాయి. ఈ కార్లు ఈ ఫ్యూయల్‌తో సజావుగా పనిచేస్తాయి. కానీ 2023కి ముందు తయారైన పాత వాహనాలు సాధారణంగా ఈ10 లేదా ప్యూర్ పెట్రోల్‌కు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అందువల్ల వాటిలో ఈ20 వాడితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
పాత వాహనాల్లో సమస్యలు రావడానికి ప్రధాన కారణం.. ఇథనాల్ స్వభావం. ఇథనాల్ నీటిని ఆకర్షించే లక్షణం కలిగి ఉంటుంది. దీని వల్ల ఫ్యూయల్ ట్యాంక్‌లో తేమ చేరి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రబ్బర్ సీల్స్, ప్లాస్టిక్ ఫ్యూయల్ లైన్స్ వంటి భాగాలు కాలక్రమేణా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌లో మురికి పేరుకుపోయి పనితీరు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా.. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ తక్కువగా ఉండటంతో మైలేజ్ కొంత తగ్గుతుంది.
ఇదీ చదవండి: రూ.20 లక్షల కారు కొనడంపై ChatGPT క్లారిటీ
అయితే.. పాత వాహన యజమానులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ20 వల్ల కలిగే సమస్యలను తగ్గించుకోవచ్చు. ఫ్యూయల్ అడిటివ్స్ వాడడం ఒక సులభమైన మార్గం. ఇవి ఇంధనంలోని ఇథనాల్ ప్రభావాన్ని కొంతవరకు నియంత్రించగలవు. అలాగే.. పాత ఫ్యూయల్ లైన్స్‌ను PTFE లేదా బ్రైడెడ్ స్టీల్ లైన్స్‌తో మార్చడం ద్వారా దీర్ఘకాలిక రక్షణ పొందవచ్చు. ఇంజిన్ సీల్స్‌ను విటాన్ వంటి మెటీరియల్స్‌తో అప్‌గ్రేడ్ చేయడం కూడా ఉపయోగకరం.
మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న వాహనాల్లో తుప్పు రాకుండా స్పెషల్ కోటింగ్ చేయించుకోవచ్చు. వాహనాల్లో ఈసీయూ ట్యూనింగ్ లేదా అప్‌డేటెడ్ మ్యాపింగ్ ద్వారా కూడా ఈ20 అనుకూలతను మెరుగుపరచవచ్చు. కాబట్టి పాత వాహనాలను ఉపయోగించేవాళ్లు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.


