డిఫ్లేషన్ భయం.. బంగారం, వెండి ధరలు పడిపోతాయా? | Deflation Risk Could Put Pressure on Gold and Silver Prices Says Amit Goel | Sakshi
Sakshi News home page

డిఫ్లేషన్ భయం.. బంగారం, వెండి ధరలు పడిపోతాయా?

Jun 23 2026 5:23 PM | Updated on Jun 23 2026 6:06 PM

Deflation Risk Could Put Pressure on Gold and Silver Prices Says Amit Goel

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో డిఫ్లేషన్ (Deflation) దిశగా వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ వ్యూహకర్త అమిత్ గోయెల్ చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది నిపుణులు ద్రవ్యోల్బణం (Inflation) కొనసాగుతుందని భావిస్తున్నా.. అమిత్ మాత్రం పరిస్థితి వేరుగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.

డిఫ్లేషన్ అంటే ఏమిటి?
సాధారణంగా వస్తువులు, సేవల ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం (Inflation) అంటారు. అయితే.. దీనికి విరుద్ధంగా, వస్తువుల ధరలు నిరంతరం తగ్గుతూ ఉండే పరిస్థితిని డిఫ్లేషన్ అంటారు. ఇది వినియోగదారులకు మొదట లాభంగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

ఎలా అంటే.. ధరలు తగ్గితే, ప్రజలు ఖర్చులు తగ్గిస్తారు, కంపెనీల ఆదాయాలు పడిపోతాయి. సంస్థలకు వచ్చే ఆదాయం తగ్గితే.. ఈ ప్రభావం ఉద్యోగులపై పడుతుంది. దీంతో ఆర్థిక వృద్ధి కూడా మందగిస్తుంది.

డిఫ్లేషన్‌కు కారణాలు ఏమిటి?
అమిత్ గోయల్ అభిప్రాయం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అప్పుల భారం, కృత్రిమ మేధస్సు వల్ల ఉత్పాదకత పెరగడం డిఫ్లేషన్‌కు దారితీయవచ్చు.

ఏఐ వినియోగం పెరగడం వల్ల.. సంస్థల ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఉత్పత్తులు, సేవలు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. దీని ప్రభావంగా ధరలు తగ్గే పరిస్థితి ఏర్పడవచ్చు. మరోవైపు.. ప్రభుత్వాలు, సంస్థలపై పెరుగుతున్న అప్పుల భారం ఆర్థిక వృద్ధిని తగ్గించే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.

బంగారం, వెండిపై ప్రభావం
సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకోవడానికి బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతారు. అందువల్ల వాటి ధరలు పెరుగుతాయి.

కానీ.. డిఫ్లేషన్ పరిస్థితుల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నగదు విలువ పెరగడం, పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడటం వంటి కారణాల వల్ల బంగారం, వెండి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా వాటి ధరలు తగ్గే అవకాశం ఉందని గోయల్ అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement