మెటా కీలక నిర్ణయం.. భారతీయుడికి వాట్సాప్ పగ్గాలు! | CRED Founder Kunal Shah To Lead WhatsApp Globally | Sakshi
Sakshi News home page

మెటా కీలక నిర్ణయం.. భారతీయుడికి వాట్సాప్ పగ్గాలు!

Jun 23 2026 4:10 PM | Updated on Jun 23 2026 4:23 PM

CRED Founder Kunal Shah To Lead WhatsApp Globally

ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన మెటా.. భారతీయ ఫిన్‌టెక్ సంస్థలో సుమారు 900 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8,550 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంతో పాటు క్రెడ్ ఫౌండర్ 'కునాల్ షా'ను వాట్సాప్ కొత్త అధిపతిగా నియమితులయ్యారు. ఏడేళ్లుగా ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌కు నాయకత్వం వహించిన విల్ క్యాత్‌కార్ట్ (Will Cathcart) స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు.

మెటా సంస్థ క్రెడ్‌లో సుమారు 20 శాతం మైనారిటీ వాటాను పొందనుంది. ఈ డీల్ తర్వాత క్రెడ్ కంపెనీ విలువ సుమారు 4.5 బిలియన్ డాలర్లు (రూ. 43,239 కోట్లు)గా అంచనా వేశారు. ఈ నిధులు కొత్త షేర్ల కొనుగోలు, ఇప్పటికే ఉన్న షేర్ల కొనుగోలు రూపంలో సమకూరుతున్నాయి.

ఈ ఒప్పందంలో.. అత్యంత ఆసక్తికరమైన అంశం కునాల్ షా కొత్త బాధ్యత. ఆయన క్రెడ్ సీఈఓ పదవి నుంచి తప్పుకుని మెటా గ్లోబల్ లీడర్‌షిప్ టీమ్‌లో చేరనున్నారు. వాట్సప్‌ను తదుపరి దశకు తీసుకెళ్లడం, ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్ సేవలు, ఏఐ ఆధారిత ఫీచర్ల ద్వారా ఆదాయాన్ని పెంచడం ఆయన ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి. కాగా వాట్సప్‌ను గత ఏడు సంవత్సరాలుగా నడిపించిన విల్ క్యాథ్‌కార్ట్, మెటాలోనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులపై పనిచేయనున్నారు.

కునాల్ షా వైదొలగడంతో, 2020 నుంచి కంపెనీ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మిటెన్ సంపత్‌ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్తులో స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో క్రెడ్ కొత్త శాశ్వత నాయకత్వ నిర్మాణంపై పనిచేస్తోంది.

ఇదీ చదవండి: హెచ్చరిక.. వెలుగులోకి కొత్త స్కామ్!

2018లో ప్రారంభమైన CRED మొదట క్రెడిట్ కార్డు బిల్లులను సమయానికి చెల్లించే వినియోగదారులకు రివార్డులు అందించే ప్లాట్‌ఫారమ్‌గా మొదలైంది. తర్వాత ఇది చెల్లింపులు, లోన్స్, ఇన్సూరెన్స్, సంపద నిర్వహణ, లైఫ్‌స్టైల్ సేవలు వంటి అనేక రంగాలకు విస్తరించింది. ప్రస్తుతం క్రెడ్‌కు 1.7 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్ సభ్యులు ఉన్నారు. భారతదేశంలోని మొత్తం క్రెడిట్ కార్డు బిల్ చెల్లింపుల్లో 40 శాతానికి పైగా ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా జరుగుతున్నట్లు కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement