డబ్బు నిజంగా మనిషికి సంతోషాన్ని ఇస్తుందా? అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. కొందరి అభిప్రాయం ప్రకారం.. సంతోషం అనేది ప్రేమ, సంబంధాలు, ఆరోగ్యం, జీవిత లక్ష్యం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. మరికొందరు మాత్రం ఆర్థిక భద్రత ఉంటేనే మనిషి ప్రశాంతంగా జీవించగలడని చెబుతారు. ఈ అంశంపై ప్రముఖ వ్యాపారవేత్త బిల్ గేట్స్ (Bill Gates) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
2019లో జరిగిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే సెషన్‌లో ఒక రెడ్డిట్.. అపారమైన సంపద (డబ్బు) జీవితంలో నిజంగా సంతోషాన్ని పెంచిందా అని గేట్స్‌ను అడిగారు. దానికి ఆయన సమాధానంగా, ''అవును, నేను ఆరోగ్య ఖర్చులు, విద్య ఖర్చులు, ఆర్థిక సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. అది నాకు చాలా పెద్ద ఉపశమనం'' అని చెప్పారు. అంటే డబ్బు వల్ల ఆయనకు లగ్జరీ కంటే ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడిలేని జీవితం లభించిందని స్పష్టమవుతోంది.
సంతోషంగా ఉండటానికి బిలియనీర్ కావాల్సిన అవసరం లేదని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక స్థిరత్వం ఉంటే సరిపోతుంది, అది మనిషి జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా మారుస్తుందని చెప్పారు.
అయితే నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త డేనియల్ కాహ్నెమాన్, ఆర్థికవేత్త ఆంగస్ డీటన్ చేసిన పరిశోధనల్లో.. ఆదాయం పెరిగే కొద్దీ మనిషి జీవితంలో ఒత్తిడి తగ్గి సంతోషం పెరుగుతుంది. కానీ ఒక స్థాయికి చేరిన తర్వాత అదనపు సంపద సంతోషాన్ని పెద్దగా పెంచదని తెలిపారు.
ఇదీ చదవండి: డబ్బు అవసరం ఉండదు!: ఎలాన్ మస్క్


