
నేను రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. వీటిపై మెరుగైన రాబడులకు ఉన్న మార్గం ఏంటి? – సుదీప్త్ సేన్
ఏ ఇన్వెస్టర్ అయినా గరిష్ట రాబడి కోరుకోవడం సహజమే. కానీ, అధిక రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. పెట్టుబడులపై మెరుగైన రాబడులను పొందేందుకు కొన్ని అంశాల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. కేవలం రాబడి కోణంలోనే పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకుంటే అది నష్టానికి దారితీయవచ్చు. అందుకుని ప్రతీ పెట్టుబడి సాధనం ఎంపిక ముందు అందులోని సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో అధిక రాబడులు ఇవ్వగలవు. కానీ, దీనికి గ్యారంటీ ఉండదు. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. అస్థిరతలు ఎక్కువగా ఉంటుంటాయి. అత్యవసర పరిస్థితుల్లో మార్కెట్లు కరెక్షన్‌కు లోనై ఉంటే అప్పుడు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకుని స్వల్పకాలానికి ఈ తరహా రిస్క్‌ను అధిగమించేందుకు డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.
ఐదేళ్లు అంతకుమించిన కాలానికి ఈక్విటీలను ఎంపిక చేసుకోవాలి. అలాగే పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒక ఫండ్ బలహీన పనితీరు చూపించినా.. మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల స్వల్ప కాలంలో పెట్టుబడులపై మార్కెట్ కరెక్షన్ల ప్రభావాన్ని అధిగమించొచ్చు. చివరిగా అస్సెట్ అలోకేషన్‌ను పాటించాలి. డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడంతోపాటు, ఆ పెట్టుబడులను ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా డెట్, ఈక్విటీ పెట్టుబడుల్లో, కేటాయింపుల్లో మార్పులు చేసుకోవాలి.
నాకు పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఉన్నత విద్య కోసం ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. ఇందుకు ఏ సాధనాలను ఎంచుకోవాలి? – విద్యారణ్య
పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయంలో చాలా మంది తల్లిదండ్రులు సందేహం ఎదుర్కొంటుంటారు. ఒకే విడత పెట్టుబడితోపాటు క్రమానుగత పెట్టుబడి (సిప్)ని సైతం ఎంపిక చేసుకోవచ్చు. ఉన్నత విద్య కోసం అనుకుంటే అందుకు, సాధారణంగా పదేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలు మెరుగైన సాధనమే అని చెప్పాలి. ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది.
ఇదీ చదవండి: కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే!
ఈక్విటీల్లో అస్థిరతలు సహజంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్‌ను తగ్గిస్తుంది. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని ఒక డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎన్‌టీపీ) రూపంలో ఎంపిక చేసుకున్న ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి. మూడేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయాలి. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది.