
‘నేను ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. కాబట్టి నేను ఎందుకు రిటర్నులు వేయాలి?’ చాలా మంది ఇలానే భావిస్తుంటారు. ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం.. స్థూల ఆదాయంపై ఉన్న పరిమితులు దాటితే తప్పకుండా రిటర్నులు వేయాల్సిందే. చట్టంలో కల్పించిన రాయితీలు, మినహాయింపుల ప్రకారం ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేకపోయినా సరే.. రిటర్నులు సమర్పించడం ద్వారానే వాటిని క్లెయిమ్ చేసుకుని, పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. రిటర్నులు దాఖలు చేయకపోతే మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే హక్కును కోల్పోతారు. సెప్టెంబర్ 15 ఐటీఆర్ దాఖలుకు చివరి తేదని గుర్తుంచుకోవాలి.
పరిమితులు
ఒక వ్యక్తి వార్షిక ఆదాయం బేసిక్ ఎగ్జెంప్షన్ (ప్రాథమిక మినహాయింపు) పరిమితి దాటితే రిటర్నులు (ఐటీఆర్) తప్పనిసరిగా దాఖలు చేయాలని చట్టం నిర్దేశిస్తోంది.
పాత పన్ను విధానంలో 60 ఏళ్లు దాటని వారికి రూ.2,50,000 ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిగా ఉంది. 60–80 ఏళ్ల మధ్యవయసు వారికి రూ.3,00,000, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5,00,000 పరిమితి అమల్లో ఉంది.
కొత్త విధానం కింద అన్ని వయసుల వారికి ఈ పరిమితి రూ.3,00,000గా ఉంది. ఆదాయం ఈ పరిమితుల్లోనే ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఎవరు ఫైల్ చేయాలంటే..
👉ఉదాహరణకు కుమార్ వార్షిక ఆదాయం రూ.2.4 లక్షలు. పింఛను, బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో ఈ మొత్తం సమకూరింది. కానీ, వడ్డీ ఆదాయంపై 10 శాతం టీడీఎస్ కింద బ్యాంక్ మినహాయించింది. ఈ కేసులో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. కానీ, బ్యాంక్ నుంచి ఆదాయపన్ను శాఖకు వెళ్లిన టీడీఎస్ మొత్తాన్ని తిరిగి పొందాలంటే (రిఫండ్) రిటర్నులను నిర్ణీత గడువులోపు సమర్పించడం ద్వారానే సాధ్యపడుతుంది.
👉ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరం పరిధిలో తమ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.50 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే తప్పకుండా ఐటీఆర్ దాఖలు చేయాలి.
👉ఒకటి లేదా ఒకటికి మించిన కరెంట్ ఖాతాలలో కలిపి (వాణిజ్య, కోపరేటివ్ బ్యాంకుల) రూ.కోటి, అంతకు మించి డిపాజిట్ చేస్తే రిటర్నులు సమర్పించాలి. వ్యక్తులకే గానీ వ్యాపార సంస్థలకు ఈ నిబంధన వర్తించదు.
👉ఏడాదిలో అమ్మకాల ఆదాయం రూ.60 లక్షలు మించితే వ్యాపార సంస్థలు రిటర్నులు వేయాలి.
👉ఒక విద్యుత్ బిల్లు రూ.లక్ష మించినా లేదా ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద విద్యుత్ బిల్లు రూ.లక్షకు మించిన సందర్భంలోనూ పన్ను రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది.
👉వివిధ రూపాల్లో టీడీఎస్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000, అంతకు మించి ఉంటే అప్పుడు కూడా రిటర్నులు వేయాల్సిందే. 60 ఏళ్లు నిండిన వారికి ఈ పరిమితి రూ.50,000గా ఉంది.
👉విదేశీ ఆస్తుల సమాచారాన్ని ఐటీఆర్‌లోని షెడ్యూల్ ఎఫ్‌ఏ కింద తప్పకుండా వెల్లడించాలి. విదేశీ ఖాతాకు సంతకం చేసే అధికారం కలిగి ఉన్న వారు సైతం రిటర్నులు వేయాల్సిందే. భార్యా, భర్తలు సంయుక్తంగా విదేశాల్లో ఆస్తికి యజమానులుగా ఉంటే అప్పుడు ఇద్దరూ విడిగా రిటర్నులు దాఖలు చేసి, ఆస్తి వివరాలు వెల్లడించాలి.
ఇదీ చదవండి: ‘నెలకు రూ.2 లక్షల స్టైపెండ్’.. పుచ్‌ఏఐ సీఈఓ ప్రకటన
👉విదేశీ కంపెనీల షేర్లను కలిగి వారు సైతం రిటర్నులు ద్వారా ఆ వివరాలు వెల్లడించాలి.
👉దేశీయ అన్‌లిస్టెడ్ కంపెనీల్లో వాటాలు (షేర్లు) కలిగిన వారు కూడా రిటర్నులు దాఖలు చేసి వెల్లడించాలి.
👉ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ పర్యటనలపై (తనకోసం, ఇతరుల కోసం) చేసిన ఖర్చు రూ.2 లక్షలకు మించినట్టయితే పన్ను రిటర్నులు తప్పకుండా దాఖలు చేయాలి.
👉మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ (తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ) చేసుకోవాలని అనుకుంటే సెక్షన్ 139(3) కింద గడువులోపు రిటర్నులు వేయడం తప్పనిసరి. సెక్షన్ 54, 54బి, 54ఈసీ లేదా 54 ఎఫ్ కింద మూలధన నష్టాలపై మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవడం రిటర్నుల దాఖలుతోనే సాధ్యపడుతుంది.
👉సెక్షన్ 10(1) కింద వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు. వ్యవసాయంపై ఆదాయానికి అదనంగా.. వ్యవసాయేతర కార్యకలాపాల ద్వారా ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించి ఉంటే అప్పుడు రిటర్నులు సమర్పించాల్సిందే.