టాటా గ్రూప్ సారథ్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఆర్థిక ఒడిదొడుకుల నేపథ్యంలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సంస్థ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కొత్త విమానాల డెలివరీలను వాయిదా వేయడంతో పాటు, తన ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తాము ఆర్డర్ చేసిన సుమారు 500 విమానాల డెలివరీ ప్రక్రియను మందగించేలా (స్లో డౌన్) చేయడంపై ప్రముఖ విమాన తయారీ సంస్థలైన ‘ఎయిర్‌బస్ ఎస్ఈ’, ‘బోయింగ్ కో’లతో ఎయిరిండియా చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.
భారీ చెల్లింపులు తప్పించుకునేందుకా?
సాధారణంగా విమానయాన సంస్థలు జెట్ విమానాల కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులను చాలా సంవత్సరాల పాటు విడతల వారీగా చెల్లిస్తాయి. అయితే, మొత్తం కొనుగోలు ధరలో సింహభాగం..అంటే దాదాపు 80 శాతం నిధులను విమానాన్ని అప్పగించే (డెలివరీ) సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డెలివరీలను వాయిదా వేసుకోవడం ద్వారా తయారీదారులకు చెల్లించాల్సిన ఈ భారీ వ్యయాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవచ్చని, తద్వారా ప్రస్తుత నిధుల కొరత నుంచి ఉపశమనం పొందవచ్చని ఎయిరిండియా వ్యూహాత్మకంగా యోచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.
దీనితో పాటు కొత్త దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభించే ప్రణాళికలపై సంస్థ పునసమీక్ష జరుపుతోంది. లాభదాయకంగా లేని కొన్ని పాత మార్గాలను పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించింది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ఎయిర్‌పోర్ట్‌ల్లో తమ కార్యకలాపాల ప్రారంభాన్ని వాయిదా వేయాలని చూస్తోంది. ఇప్పటికే వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఎయిరిండియా గత నెలలో అంతర్జాతీయ విమాన సామర్థ్యాన్ని తాత్కాలికంగా 27 శాతం (జూన్ - ఆగస్టు మధ్య 145 వారపు విమానాలు), దేశీయ విమాన సామర్థ్యాన్ని 22 శాతం వరకు తగ్గించిన సంగతి తెలిసిందే.
ఇందుకు దారితీసిన కారణాలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల తరచూ గగనతలం మూసివేత.
గత ఏడాది మార్చి నుంచి పాకిస్థాన్ వైపు గగనతలాన్ని శాశ్వతంగా మూసివేయడం వల్ల విమాన ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు పెరగడం.
అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు భగ్గుమనడం.
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం.
ఎయిర్ ఇండియా ప్రతినిధి ఏమన్నారంటే..
బ్లూమ్‌బెర్గ్ నివేదికపై ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ... ఈ వార్తలు కేవలం ఊహాజనితమైనవని కొట్టిపారేశారు. తమ ఫ్లీట్‌ను ఆధునీకరించడానికి, దీర్ఘకాలిక పరివర్తన ప్రణాళికను అమలు చేయడానికి సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో..


