టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్‌? | Air India Chairman Denied Link Between Turkish Co With AI 171 Crash, Check More Details Inside | Sakshi
Sakshi News home page

టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్‌?

Jun 20 2025 11:28 AM | Updated on Jun 20 2025 12:08 PM

Air India Chairman denied link between Turkish co with AI 171 crash

అహ్మదాబాద్‌లో 270 మందిని బలిగొన్న ఎయిరిండియా ఏఐ-171 డ్రీమ్‌లైనర్‌ ప్రమాదానికి టర్కిష్ ఎయిర్‌లైన్స్‌ మెయింటెనెన్స్ సెంటర్‌తో సంబంధం ఉందన్న ఊహాగానాలను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఖండించారు. టైమ్స్ నెట్ వర్క్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఎయిరిండియా ఫ్లీట్‌లోని 33 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాల్లో ఏదీ టర్కీ సంస్థ నిర్వహణలో లేదని స్పష్టం చేశారు.

‘ఎయిరిండియా ఆధ్వర్యంలోని 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఏ ఒక్కటీ టర్కిష్ సంస్థ నిర్వహణలో లేదు. వాటిలో చాలా వరకు ఏఈఎస్ఎల్, సింగపూర్‌లోని ఎస్ఐఏ ఇంజినీరింగ్ నిర్వహణలో ఉన్నాయి. బోయింగ్ 777 విమానాల్లో కొన్నింటిని మాత్రమే టర్కిష్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుతం ఆయా కాంట్రాక్టులు కూడా సమీక్షలో ఉన్నాయి’ అని చెప్పారు. ప్రస్తుతం ప్రమాద సంఘటనపై జరుగుతున్న దర్యాప్తునకు సంబంధించి కొందరు విజిల్ బ్లోయర్లు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖరన్ ఈ వాదనలను ‘ఊహాజనితమైనవి’గా అభివర్ణించారు. ఘటనపై మరింత స్పష్టత వచ్చేందుకు విమాన డేటా, కాక్ పిట్ వాయిస్ రికార్డర్లు, బ్లాక్ బాక్స్ నివేదికల కోసం వేచి ఉండాలని తెలిపారు.

‘యూట్యూబ్, మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఇలా చాలా మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోంది. బ్లాక్ బాక్స్ డేటాతో నిజం తేలుతుంది. దాని కోసం వేచిచూడాలి తప్పా ఓ నిర్ణయానికి రాకూడదు’ అని అన్నారు. ఎయిరిండియా విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. ‘ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. వారిలో ఎవరినీ ఓదార్చడానికి నాకు మాటలు లేవు. టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థలో జరిగిన ఈ ప్రమాదం పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. ఈ సమయంలో మేము వారికి తోడుగా ఉండడం తప్పా వారి లోటును తీర్చలేం.  వారికి అన్ని విధాలుగా తోడుంటాం. తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, కొడుకును కోల్పోయిన వారిని ఓదార్చడం చాలా కష్టం’ అని అన్నారు.

ఇదీ చదవండి: వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం

ఈ ఘోర ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోంది. గుజరాత్ ప్రతినిధి, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ (ఎంవోసీఏ) కార్యదర్శి, ఎంహెచ్ఏ అదనపు కార్యదర్శితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని దర్యాప్తులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement