ముంబై ఎయిర్‌పోర్ట్‌ కోసం అదానీ నిధుల సమీకరణ | Adani Raises USD 1 Billion For Mumbai Airport | Sakshi
Sakshi News home page

ముంబై ఎయిర్‌పోర్ట్‌ కోసం అదానీ నిధుల సమీకరణ

Jun 25 2025 5:52 PM | Updated on Jun 25 2025 6:22 PM

Adani Raises USD 1 Billion For Mumbai Airport

న్యూఢిల్లీ: గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థల నుంచి డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 8,600 కోట్లు) సమీకరించింది. నిధులను ముంబై ఎయిర్‌పోర్ట్‌ రుణాల రీఫైనాన్సింగ్‌కు వినియోగించనుంది. న్యూయార్క్‌ సంస్థ అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ అధ్యక్షతన మెట్‌లైఫ్‌ ఇంక్, బ్లాక్‌రాక్‌ ఇంక్, ఎఫ్‌డబ్ల్యూడీ ఇన్సూరెన్స్‌ నిధులు సమకూర్చాయి.

ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(ఎంఐఏఎల్‌) కోసం 2022లో సమీకరించిన రుణాల రీఫైనాన్స్‌కు నిధులు వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్‌ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. ఎంఐఏఎల్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వాటా 74 శాతంకాగా.. భారత ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి 26 శాతం వాటా ఉంది. దేశీయంగా రెండో పెద్ద ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తున్న కంపెనీ 2029 జులైలో గడువుతీరే 75 కోట్ల డాలర్ల విలువైన నోట్లను జారీ చేసింది. వీటికి అదనంగా 25 కోట్ల డాలర్ల నోట్లను జారీ చేసే వీలుతో నిధుల సమీకరణ చేపట్టింది.

తద్వారా బిలియన్‌ డాలర్లను సమకూర్చుకుంది. దీంతో ఎంఐఏఎల్‌ అభివృద్ధి, ఆధునీకరణ, సామర్థ్య విస్తరణకు ఆర్థిక వెసులుబాటు లభించనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలియజేసింది. తాజాగా జారీ చేసిన బాండ్లు 6.9 శాతం కూపన్‌రేటుతో నాలుగేళ్ల కాలానికి గడువు తీరనున్నాయి. ఎయిర్‌పోర్ట్‌ మౌలికసదుపాయాల రంగంలో తొలి ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ ప్రయివేట్‌ బాండ్ల జారీని చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement