చుంచుపల్లి/ఇల్లెందు రూరల్: జిల్లా మీదుగా ప్రతిపాదిత జాతీయ రహదారి అభివృద్ధి పనులకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర అటవీ శాఖకు చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎస్.యువరాజ్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో ప్రతిపాదిత జాతీయ రహదారి అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించి మాట్లాడారు. ఎన్‌హెచ్–930పీలో నెహ్రూనగర్ నుంచి కొత్తగూడెం వరకు రహదారిని రెండు, నాలుగు లేన్ల అభివృద్ధి చేసే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం 78.1804 హెక్టార్ల అటవీ భూమి కేటాయించి, 9వేల చెట్లు తొలగించేలా ప్రతిపాదనల్లో పొందుపర్చారని చెప్పారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతం, భౌగోళిక పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణ అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ బీమానాయక్, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఇల్లెందు ఎఫ్‌డీఓ కరుణాకరాచారి, సిబ్బంది పాల్గొన్నారు.


