భూ రీసర్వే వేగవంతం చేయాలి
● నీటి లభ్యత ఆధారంగా తాగునీటికి ప్రాధాన్యమివ్వాలి ● తాలిపేరు ప్రాజెక్ట్ సందర్శనలో కలెక్టర్ అంకిత్
సూపర్‌బజార్(కొత్తగూడెం)/చర్ల: వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్‌ను, ఏకలవ్య మోడల్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. ప్రాజెక్టులో నీటిమట్టం, ఇన్‌ఫ్లో, నీటి విడుదల, ప్రాజెక్టు నిర్వహణ, సిబ్బంది తదితర వివరాలు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, ప్రాజెక్టు భద్రత, నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, గేట్ ఆపరేటర్లు, పంప్ ఆపరేటర్లను శాశ్వత ప్రాతిపదికన కేటాయించాలని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్‌కు విన్నవించారు. అనంతరం చర్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధనతీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠశాల ఆవరణలోని హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించి, మందుల నిల్వ, విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పరిశుభ్రత పాటించాలని చెప్పారు. తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, ఎంపీడీఓ ఈదయ్య, ఎంఈఓ పీవీ రమణ ఇరిగేషన్ అధికారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు రూ 95.90 లక్షల చెక్కు అందజేత
జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధికి కేటీపీఎస్ 7వ దశ సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధుల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి రూ 95,90,802 తుది విడత నిధుల చెక్కును చీఫ్ ఇంజనీర్ బి.శివరామ్‌రెడ్డి బుధవారం కలెక్టర్ అంకిత్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ సివిల్ విభాగం సూపరింటెండింగ్ ఇంజనీర్ యుగపతి పాల్గొన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో పాల్వంచ పట్టణంలోని ఇందిరానగర్ నుంచి గిరిజన ప్రాంతమైన జగన్నాథపురం వరకు సెంట్రల్ లైటింగ్, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని వివిధ గ్రామపంచాయతీల పరిధిలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నారు.
భూముల రీసర్వే కార్యక్రమం వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. సర్వే పనుల కోసం రూ 22.84 లక్షలతో నాలుగు అధునాతన డీజీపీఎస్ రోవర్లను జిల్లాకు సమకూర్చినట్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో లైసెన్సుడ్ సర్వేయర్లకు వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో సర్వే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 17 డీజీపీఎస్ రోవర్లు అందుబాటులో ఉన్నాయని, తాజాగా మరో నాలుగు రోవర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సర్వే ఏడీ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, లైసెన్సుడ్ సర్వేయర్లు పాల్గొన్నారు.


