భద్రత కల్పించాలి..
వేటగాళ్ల చేతిలో బలవుతున్న
అటవీ అధికారులు
నకిరిపేట ఘటనతో ఉలిక్కిపడిన ఫారెస్ట్ సిబ్బంది
ఉద్యోగ భద్రతపై భయాందోళనలు
బూర్గంపాడు: అడవులను రక్షించే అధికారులకే భద్రత కరువైంది. బూర్గంపాడు మండలం నకిరి పేట అటవీప్రాంతంలో వేటగాళ్ల అమర్చిన విద్యుత్ తీగలు తాకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతిచెందిన ఘటనతో జిల్లా అటవీశాఖలో తీవ్ర విషా దం అలుముకుంది. అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు అమర్చారనే సమాచారంతో రాత్రి వేళలో సహచరులతో విధి నిర్వహణకు వెళ్లిన అధికారి ప్రాణం పోగొట్టుకున్నాడు. డీఆర్‌ఓతోపాటు ఆరుగురు బీట్ ఆఫీసర్లు విద్యుత్ ఉచ్చులను తప్పించాలనుకునే క్రమంలో ఓ బీట్ ఆఫీసర్ విద్యుదాఘాతంతో మృతిచెందగా, అతనితోపాటు వెళ్లిన మిగతా అధికారులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కళ్ల ముందే తమతో వచ్చిన అధికారి మృతిచెందటం మిగతా అధికారులను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నా తమ భద్రతకు ఎలాంటి చర్యలూ ఉంటడం లేదనే ఆందోళన అటవీశాఖ అధికారుల్లో వ్యక్తమవుతోంది.
అటవీ అధికారుల ఆవేదన
అడవుల నరికివేతను అడ్డుకుంటూ, కొత్తగా పోడు సాగు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటూ, వన్యప్రాణుల సంరక్షణ కోసం అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోడుసాగుదారులు తిరగబడి దాడులు చేసిన ఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. నాలుగేళ్ల క్రితం ఓ అటవీశాఖ అధికారి ప్రాణాలే తీసిన ఘటన కూడా ఉమ్మడి జిల్లాలో జరిగింది. పోడు సాగుదారులను అడ్డుకుంటే రాజకీయ పార్టీల ఒత్తిళ్లు, ప్రజా ప్రతినిధుల బెదిరింపులు, ప్రజాసంఘాల హెచ్చరికలతో అటవీశాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు అధికారంలో ఉన్నవారు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా తమను దోషులుగా చూస్తున్నారే తప్ప అటవీ సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నామనే గుర్తింపు లేకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు.
వన్యప్రాణుల వేటకు విద్యుత్ తీగలు పెడుతున్నవారిపై విద్యుత్, పోలీస్ శాఖలు కూడా నిఘా పెట్టాలని అటవీ అధికారులు కోరుతున్నారు. వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోడు సాగును అడ్డుకుంటున్న క్రమంలో తమకు పోలీస్, రెవెన్యూ శాఖలు కూడా సహకారం అందించాలని కోరుతున్నారు. తమకు భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, విధి నిర్వహణలో అసువులు బాసిన అటవీ అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.


