స్పందించని వ్యవసాయశాఖ
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న 14 మంది మహిళా కూలీలు
రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రాణాల మీదకు తెచ్చిన పిచికారీ ?
అజాగ్రత్తగా పిచికారీ..
టమాట తోట నుంచి వచ్చినప్పటి నుంచి కళ్లలో మంట, తల తిరగడం మొదలైంది. ఒకటి రెండు సార్లు వాంతులు కూడా అయ్యాయి. ఏమయిందో తెలియని అయోమయ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించటంతో వైద్య సేవలు అందించారు. పురుగుల మందు తీవ్రత వల్లనే ఇలా జరిగింది.
–అలివేలు మంగ
కూలీలు అందరం తోటలో పనులు చేస్తుండగానే చెట్లకు పురుగు మందును పిచికారీ చేయించారు. ఇంటికి వచ్చాక తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆస్పత్రికి వచ్చాం.
–హరిత, కూలీ
మా తోటలో రోజూ 30 మంది వరకు పనికి వస్తుంటారు. సోమవారం కూడా అలానే వచ్చారు. ఎప్పటిలాగే ఒమిటే మందును పిచికారీ చేశాం. ఆ తర్వాత, కేవలం న్యూగొల్లగూడెం ప్రాంతానికి చెందిన కూలీలే అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఇతర ప్రాంతాల వారికి ఏమీ కాలేదు. బహుశా న్యూగొల్ల గూడెం కూలీల విషయంలో ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చు. మా తోటలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఫుటేజీ పరిశీలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి.
– నర్రా అజయ్, టమాట తోట యజమాని
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చుంచుపల్లి: పురుగుల మందు ప్రభావంతో పలువురు మహిళా కూలీలు అస్వస్థతకు గురైన ఘటన బుధవారం కొత్తగూడెం నగరంలో కలకలం రేపింది. బాధిత కూలీలు తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారీ కూలీ పనుల్లో భాగంగా కొత్తగూడెం పట్టణ పరిధిలోని న్యూ గొల్లగూడెం ఒకే ప్రాంతానికి చెందిన 14 మంది మహిళలు సుజాతనగర్ మండలం కొత్త అంజనాపురానికి సోమవారం కూలీకి వెళ్లారు. అక్కడ నర్రా అజయ్ కుమార్‌కు చెందిన మూడు ఎకరాల కూరగాయల తోటల్లో టమాటాలకు పురికొసలు కట్టే పనిలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదే టమాట తోటలో నలుగురు పురుష కూలీలు ముడత మందు(ఒమిటే పురుగుల మందు)ను పిచికారీ చేయడం మొదలెట్టారు. దీనిపై కూలీలు అభ్యంతరం వ్యక్తం చేయగా ‘మాపని మాది, మీ పని మీది’ అంటూ పిచికారీని అలాగే కొనసాగించారు.
ఒక్కొక్కరుగా అస్వస్థతకు..
పొలంలో ఉన్నప్పుడే ఒక కూలీకి తలనొప్పి, వాంతులు కాగా, అదే రోజు సాయంత్రం కొత్తగూడెం సర్వజన ఆస్పత్రికి చేరుకుంది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇవే లక్షణాలతో మరో ఇద్దరు మహిళా కూలీలు ఆస్పత్రికి వచ్చారు. వీరికి చికిత్స కొనసాగుతుండగానే మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కరుగా మొత్తం 14 మంది మహిళా కూలీలు వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలతో ఆస్పత్రిపాలయ్యారు. ఇందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ఐసీయూకి తరలించారు. దీంతో ఆస్పత్రి వర్గాలు అనారోగ్యానికి కారణాలు ఆరా తీయగా, సోమవారం టమాట తోటలో పనికి వెళ్లినప్పుడు పురుగుల మందు పిచికారీ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని సర్వజన ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
బాధితులు వీరే
ఆందోడ విజయ, అలివేలు మంగ, చాగంటి సుమలత, గొడిసే మంజుల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వారికి అత్యవసర విభాగంలో వైద్య సేవలు అందిస్తున్నారు. మిగిలిన కూలీలు స్రవంతి, రజిత, అస్టగుర్తి ప్రసన్న, ఉదయశ్రీ, హరిత, లక్ష్మి, రమణ, కల్పన, ప్రసన్న, కొప్పుశెట్టి అనసూర్య ఉన్నారు.
పురుగుల మందుల పిచికారీ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిచికారీ చేసేటప్పుడు ఇతర పనులు చేయకూడదు. పిచికారీ సమయంలో క్షేత్రంలో ఉన్నవారు తప్పని సరిగా గ్లౌవ్స్, మాస్కులు, కళ్లద్దాలు వంటివి ధరించాలి. కానీ సుజాతనగర్ ఘటనలో ఇలాంటి జాగ్రత్తలేమి కనిపించలేదు. ఆఖరికి 14 మంది అనుమానాస్పద స్థితిలో జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి సైతం వ్యవసాయశాఖ వర్గాలకు తెలియకపోవడం గమనార్హం. ఇప్పటికై నా జరిగిన ఘటనపై వ్యవసాయశాఖ విచారణ చేసి, తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పురుగుల మందు వాసన పీల్చి వ్యవసాయ కార్మికుల ఉక్కిరిబిక్కిరి


