దుమ్ముగూడెం : పర్ణశాల శ్రీ సీతారామ చంద్రస్వామివారి ఆలయంలో జరుగుతున్న ప్రసాద్ పథకం పనులను భద్రాచలం రామాలయ ఈఓ దామోదర్‌రావు బుధవారం పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన షెడ్ల నిర్మాణం, ఫ్యాన్లు, సీసీ కెమెరాలను పరిశీలించారు. పనులు త్వరితిగతిన పూర్తి చేయాలన్నారు. పుష్కరాల నేపథ్యంలో పంచాయతీ ఆధ్వర్యంలో దేవస్థాన స్థలంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ ఖాదర్‌బాబుకు సూచించారు. శ్రావణ్‌కుమార్, అనిల్‌కుమార్, వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
విత్తనోత్పత్తి
నాణ్యతగా ఉండాలి
బూర్గంపాడు: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు వస్తాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ భరత్ అన్నారు. నాగినేనిప్రోలు గ్రామంలో బుధవారం వరి, పత్తి పంటలను ఏడీఏ తాతారావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తనాల కోసం కంపెనీలపై ఆధారపడకుండా రైతులే స్థానిక అవసరాలకు తగినట్లు విత్తనోత్పత్తిని పెంచాలన్నారు. ఏఓ శంకర్, శృతి, గాదె వెంకటేశ్వరరెడ్డి, మాధవరావు పాల్గొన్నారు.
ఆలయ భూముల
రక్షణకు నిరాహార దీక్ష
చర్ల: మండల కేంద్రంలోని సాయిబాబా గుడి పక్కన ఉన్న సర్వే నంబర్ 117 లో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ భూమిని ఆక్రమణదారుల నుంచి రక్షించాలని కోరుతూ మహారుద్ర సేన వ్యవస్థాపకుడు కొండా చరణ్ బుధవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టగా, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు చరణ్‌కు పూలమాల వేసి దీక్షను ప్రారంబించారు. దీక్షకు న్యాయవాది పరిటాల సంతోష్, లోక్ రక్షక్ పార్టీ నాయకుడు కొండా ప్రమోద్, చిట్టిమల్ల సుజాత, ఎస్‌కే భాష తదితరులు మద్దతు తెలిపారు.
సమస్యల
పరిష్కారమే లక్ష్యం
అశ్వారావుపేట/దమ్మపేట/ములకలపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్రను చేపట్టామని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. బుధవారం యాత్ర ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. దమ్మపేట బస్టాండ్‌ను వినియోగంలోకి తేవాలని, జూనియర్ కాలేజీ మంజూరు చేయాలని కోరారు. మూకమామిడి ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని కోరారు. అశ్వారావుపేటలో ఆర్డీఓ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, బస్ డిపో, డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గుమ్మడవల్లి ప్రాజెక్టు పూర్తి చేసి 1600 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ములకలపల్లిలో మేళతాళాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కొత్తగూడెం మేయర్ ఎం.గణేష్, నాయకులు బాగం హేమంతరావు, ఎం.విశ్వనాథం, కె. వెంకటేశ్వరరావు, ఎన్. ప్రసాద్, ధర్మ, ఈశ్వరరావు, సయ్యద్ సలీం, రామకృష్ణ పాల్గొన్నారు.


