పర్యాటక రంగానికి ఊతమిచ్చే లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఇల్లెందు క్రాస్‌రోడ్ దగ్గర 46 గదులతో హరిత హోటల్, కన్వెన్షన్ సెంటర్, బార్ అండ్ రెస్టారెంట్ నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. కిన్నెరసాని దగ్గర 36 గదులు కలిగిన తొమ్మిది కాటేజీలు, అద్దాల మేడలకు సంబంధించిన పనులు పూర్తయి పది నెలలు దాటింది. అయినా ఈ రెండింటిని ప్రారంభించడంలేదు. ఈ రెండు హోటళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు పిలిచారు. కాషన్ డిపాజిట్ కింద రూ.3 కోట్లు జమ చేయాలనే నిబంధన పెట్టడంతో ప్రైవేటు కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై ఏడాది కాలంగా చిక్కుముడి పడింది. దీనిపై చర్చలు జరిపి, హోటల్, కాటేజీలను పర్యాటకులు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై సరైన కార్యాచరణ కరువైంది.


