హామీల్లోనే పర్యాటకం! | - | Sakshi
Sakshi News home page

హామీల్లోనే పర్యాటకం!

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

ఎక్కడివక్కడే..

టెంపుల్‌, ఎకో టూరిజంలో జిల్లాను అగ్రగామిగా నిలుపుతామంటూ మంత్రులు హామీ ఇచ్చి రెండేళ్లు గడిచింది. అయినా అడుగు ముందుకు పడలేదు. ఆనంద ద్వీపం అభివృద్ధి, తీగల వంతెన నిర్మాణం, ట్రెక్కింగ్‌ పనులతో పర్యాటక అభివృద్ధి హామీలకే పరిమితమైంది. నిర్మాణం పూర్తయినా హరిత హోటల్‌, అద్దాల మేడ, కాటేజీలు ప్రారంభానికి నోచుకోవడంలేదు.

–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

2024 ఆగస్టు 12న మంత్రుల పర్యటన

రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు 2024 ఆగస్టు 12న కిన్నెరసానిలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముగ్గురు మంత్రులు బోటులో సుమారు రెండు గంటలపాటు జలాశయంలో విహరించారు. జలాశయం మధ్యలో ఉన్న ‘ఆనంద ద్వీపం’ కాన్సెప్టును దగ్గర నుంచి పరిశీలించారు. బోటులోనే మధ్యాహ్న భోజనం కూడా చేశారు. అనంతరం కిన్నెరసానితోపాటు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

హామీల తీరు ఇలా

● పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు అన్ని రకాలుగా అవకాశం ఉంది. ఇక్కడ అభివృద్ధి పనుల ప్రణాళిక రూపొందించే పనిని వరల్డ్‌ బెస్ట్‌ కన్సల్టెన్సీకి అప్పగిస్తాం. ఈ పనులకు సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఇరిగేషన్‌, ఫారెస్ట్‌, విద్యుత్‌, పర్యాటకంతో పాటు ఇతర శాఖలను సమన్వయం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

● రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎనిమిది టీఎంసీల సామర్థ్యంతో దీవులతో కిన్నెరసాని జలాశయం అద్భుతంగా ఉంది. అవకాశాన్ని బట్టి ఎకో, వాటర్‌, వెడ్డింగ్‌ డెస్టినేషన్‌, రిక్రియేషన్‌ తదితర విభాగాల్లో టూరిజాన్ని ప్రమోట్‌ చేస్తాం. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపితే చాలు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

● కిన్నెరసానిలో తీగల వంతెన, ట్రెక్కింగ్‌లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అప్పుడే ప్రతిపాదించారు.

రెండేళ్లు పూర్తయినా డిప్యూటీ సీఎం, పర్యాటక శాఖ మంత్రి ఇచ్చిన హామీల్లో పురోగతి లేదు. టూరిజం డెవలప్‌మెంట్‌ కోసం నియమిస్తామని చెప్పిన వరల్డ్‌ క్లాస్‌ కన్సల్టెన్సీ అంశం అటకెక్కింది. ఆనంద ద్వీపం కాన్సెప్టును పట్టించుకునేవారే లేరు. తీగల వంతెన, ట్రెక్కింగ్‌ పనులు కొండెక్కాయి. కంటి తుడుపు చర్యగా కేవలం జంగిల్‌ సఫారీ మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement