రెండేళ్లలో సైబర్ ఫిర్యాదుల వివరాలు (నష్టం, హోల్డ్ రూ. కోట్లలో, రీఫండ్ రూ. లక్షల్లో)
● సురక్ష కా తిరంగా– సైబర్ స్వతంత్ర కార్యక్రమం ● ఈ నెల 5 నుంచి మొదలైన అవగాహన కార్యక్రమాలు ● అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు
భద్రాచలంఅర్బన్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో మోసాలు చేస్తుండగా సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తితోపాటు డిజిటల్ భద్రత పై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘సురక్ష కా తిరంగా–సైబర్ స్వతంత్ర’ కార్యక్రమాన్ని చేపట్టింది. సైబర్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండటం, మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడంపై ఈ నెల 5 నుంచి 15 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, గ్రామాలు, పట్టణాలు, మార్కెట్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్, ఆన్‌లైన్ ట్రేడింగ్, రుణాల పేరుతో మోసాలు, ఫేక్ లింకులు, ఏపీకే ఫైళ్లు, ఓటీపీ, యూపీఐ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
సైబర్ నేరాల్లో కొన్ని
ఘటనల వివరాలు
● 2025 నవంబర్ 25న భద్రాచలానికి చెందిన ప్రముఖ వైద్యుడు సుబ్బరాజును సీబీఐ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేసి, రూ.20 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
● 2026 జూలై 29న తక్కువ వడ్డీకి అధిక మొత్తంలో రుణం ఇప్పిస్తామని నమ్మించి బూర్గంపాడుకు చెందిన ఓ మహిళను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. రూ.6.90 లక్షలు కాజేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సైబర్ నేరగాళ్ల ఖాతాలోని రూ.3.30 లక్షలను హోల్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
● 2025 కంటే 1202 ఫిర్యాదులు తగ్గినా, హోల్డ్, రీఫండ్ గతేడాది కంటే పెరిగింది. రెండేళ్లలో కూడా హోల్డ్ చేసిన మొత్తంలో సగం కూడా రీఫండ్ కాకపోవడం, మిగతాది పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం.
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారు. పోలీసు, సీబీఐ, ఈడీ అధికారుల పేరుతో వచ్చే కాల్స్, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ చెప్పకూడదు. అపరిచిత లింకులు, ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేయొద్దు. మోసపోతే 1930కు ఫోన్ చేయాలి. సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇవ్వడంతోపాటు లావాదేవీ వివరాలు, ఫోన్ నంబర్లు, మెసేజ్‌లు, స్క్రీన్ షాట్లు భద్రపరచాలి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా నగదును హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజల్లో అవగాహన పెంచడం కోసమే సురక్ష కా తిరంగా కార్యక్రమం చేపట్టాం. –బి.రోహిత్ రాజు, ఎస్పీ
ఏడాది ఫిర్యాదులు నష్టం హోల్డ్ రీఫండ్
2025 1,758 11.58 1.80 39.81
2026 1,202 6.89 2.07 56.94


