దొంగే దొంగ అన్నట్టుగా..
సూపర్‌బజార్(కొత్తగూడెం): ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (డీపీఆర్) తయారీ టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంస్థల సహకారంతో తలపెట్టిన డెవలప్‌మెంట్ వర్క్స్ డీపీఆర్‌పై ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. డీపీఆర్ తయారీకి త్వరలోనే ఈ–ప్రొక్యూర్‌మెంట్ టెండర్ల ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.600 కోట్లతో కార్పొరేషన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయన్నారు. కాగా, ట్రాన్సిట్ ప్లాన్ డీపీఆర్ ప్రక్రియపై సాక్షిలో వరుసగా కథనాలు వచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే.
పర్లేదు ఉండమ్మా
ట్రాన్సిట్ ప్లాన్ వివరాలను ఎమ్మెల్యే కూనంనేని మీడియాకు వివరిస్తున్న సమయంలో క్యాంప్ ఆఫీస్‌కు కొత్తగూడెం కమిషనర్ సుజాత వచ్చారు. వేదికపై సీపీఐ నాయకులు ఉండటంతో ఆ వేదికను పంచుకునేందుకు ఆమె తటపటాయించారు. నేను ఎమ్మెల్యేను ఇక్కడ ఉన్నాను. ప్రభుత్వ కార్యక్రమం కోసమే మాట్లాడుతున్నాం. ఏం పర్లేదు కూర్చొమ్మా అని ఎమ్మెల్యే భరోసా ఇవ్వడంతో ప్రెస్‌మీట్‌లో ఆమె కూడా ఆసీనులయ్యారు.
కోల్డ్‌వార్
ట్రాన్సిట్ ప్లాన్ విషయంలో సంకీర్ణ పాలకవర్గం సీపీఐ–కాంగ్రెస్‌ల మధ్య కోల్డ్‌వార్ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. మేయర్ పదవిని దక్కించుకున్న సీపీఐని బద్నాం చేసేందుకు కొన్ని అదృశ్య హస్తాలు పని చేశాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతికూల ప్రచారం కోసం ఏకంగా రూ.14 లక్షలను ‘ప్రసాదం’ తరహాలో పంచిపెట్టినట్టు కార్పొరేటర్ల మధ్య ఆఫ్ ది రికార్డుగా చర్చ జరుగుతోంది. ఇదే అదనుగా భావించిన మరికొందరు కార్పొరేటర్లు ‘డీపీఆర్ సెటిల్‌మెంట్’ కోసం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
పసిగుడ్డును గొంతు నులిమి చంపడం రాక్షసత్వమని, అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కార్పోరేషన్‌ను అభివృద్ధికి చేసే ప్రయత్నాలను అడ్డుకునేలా విమర్శలు చేయడం కూడా రాక్షసత్వమేనని కూనంనేని అభివర్ణించారు. ఇంటి నంబర్లు, ఇంటి పట్టాల విషయంలో లంచాలు తీసుకునే వారే తమపై విమర్శలు చేస్తున్నారని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దొంగలపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తమపై కూడా క్రిమినల్ కేసులు పెట్టవచ్చని వ్యాఖ్యానించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషాను షాడో ఎమ్మెల్యేగా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో మేయర్ మూడ్ గణేష్, సీసీఐ కార్పొరేటర్లు, కొత్తగూడెం కమిషనర్ సుజాతలతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా, ఇతర నాయకులు పాల్గొన్నారు.


