సాక్షిప్రతినిధి, ఖమ్మం/అశ్వారావుపేట : సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులను వేగంగా జరిగేలా అవసరమైన భూసేకరణపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించారు. ప్రాజెక్టులోని మూడో పంప్‌హౌస్ నుంచి నాలుగో పంప్‌హౌస్ వరకు నీటిని తరలించేందుకు అవసరమైన 532 ఎకరాల భూసేకరణకు రూ.45 కోట్లు అవసరమని తెలిపారు. ములకలపల్లి మండలం కమలాపురంలోని మూడో పంప్‌హౌస్ నుంచి దమ్మపేట మండలంలోని నాలుగో పంప్‌హౌస్ వరకు కాల్వ ద్వారా నీటిని తరలించే ప్రతిపాదన ఉందని తెలిపారు. ఆ పంప్‌హౌస్ నుంచి దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని చెరువులకు కాల్వలకు బదులు పైప్‌లైన్ ద్వారా నీరు అందించేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. తద్వారా వ్యయం తగ్గడమే కాక రైతులు తమ భూములను కోల్పోవాల్సిన అవసరం ఉండదని.. దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి మండలాలకు గోదావరి జలాలు అందుతాయని వెల్లడించారు.
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌తో మంత్రి తుమ్మల భేటీ


