● హంతకులపై కఠినచర్యలు తీసుకుంటాం ● జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్
బూర్గంపాడు: నరికిపేట అటవీప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ మృతిచెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్ తెలిపారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణాసాగర్ అభయారణ్యంలోని చెరువుసింగారం ఫారెస్ట్ బీట్ నకిరిపేట అటవీప్రాంతంలో ఎఫ్‌బీఓ మృతిచెందిన ప్రాంతాన్ని గురువారం ఆయన అటవీ, పోలీస్, విద్యుత్‌శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వేటగాళ్లు ఎక్కడి నుంచి విద్యుత్ అక్రమ కనెక్షన్ తీసుకున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘటన జిల్లా అటవీశాఖ అధికారుల్లో, సిబ్బందిలో ఆందోళన కలిగించిందన్నారు. విద్యుత్‌శాఖ అధికారులు వేటగాళ్ల విద్యుత్ చౌర్యంపై దృష్టి పెట్టాలన్నారు. పోలీస్‌శాఖ కూడా అటవీశాఖ అధికారుల విజ్ఞప్తులను, దరఖాస్తులను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. అటవీశాఖతో పోలీస్, విద్యుత్‌శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఎఫ్‌డీఓ కృష్ణప్రసాద్, ఎఫ్‌ఆర్‌ఓ సురేష్, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


