పూర్తిగా కూల్చివేసిన భద్రగిరి అధికారులు
భద్రాచలంటౌన్: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఉత్తర ద్వారం కాలగర్భంలోకి కలిసిపోయింది. ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఉత్తర ద్వారాన్ని ఆదివారం పూర్తిగా కూల్చివేశారు. ఉత్తర ద్వారాన్ని 1972లో నిర్మించారు. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతుండటంతో 2010లో భారీగా విస్తరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగే ముక్కోటి ఉత్సవాల్లో ఉత్తర ద్వారం నుంచే స్వామివారు దర్శనమిస్తారు. ఏటా ఆ రోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. మూడేళ్లుగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో వినియోగించే ముత్యాల తలంబ్రాలను కలిపే కార్యక్రమాన్ని కూడా ఉత్తర ద్వారం మండపంలోనే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చేవారు. దీంతో మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తర ద్వారం కూల్చివేతతో పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది భావోద్వేగానికి గురవుతున్నారు. కాగా, కూల్చివేసిన స్థానంలో ఉత్తర ద్వారంను మరింత విస్తరించి నిర్మించనున్నారు.


