సీతారామా.. కనుమా ! | - | Sakshi
Sakshi News home page

సీతారామా.. కనుమా !

Jul 20 2026 12:38 AM | Updated on Jul 20 2026 12:38 AM

ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీలో

సమస్యగా సేకరణ

అవసరమైన భూమిలో

808 ఎకరాలు అటవీభూమి

దృష్టి సారించాలని ఇటీవల

పర్యటనలో మంత్రుల ఆదేశం

భూసేకరణను అధిగమిస్తేనే..

అవసరమైన ప్రభుత్వ, ప్రైవేట్‌ భూమి

10,069.29 ఎకరాలు

పాత ఆయకట్టు స్థిరీకరణ

3.45ఎకరాలు

ఇప్పటివరకు పూర్తి

4 కి.మీ.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా నిలిచే సీతారామ బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ అడ్డంకిగా మారింది. ఈ ప్రాజెక్టు పరిధిలో అటవీ, ప్రైవేట్‌, ప్రభుత్వ భూములు ఉండడం, కొన్ని భూములు వన్యప్రాణులు జీవించే సున్నిత పర్యావరణ ప్రాంతం (ఎకో సెన్సిటివ్‌ జోన్‌) కావడంతో సమస్య నెలకొంది. ప్రాజెక్టు నిర్మాణానికి 10,069.29 ఎకరాలతోపాటు అటవీ భూములు 808.18 ఎకరాలు అవసరం కాగా.. ఇందుకోసం భూయజమానులకు రూ.1,027.02 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందులో కొందరు రైతులు నిరాకరించడం, కోర్టులకు వెళ్లడం, అటవీ అనుమతులు జారీ కాకపోవడం, పరిహారం పెండింగ్‌ వంటి కారణాలతో ఆలస్యమవుతోంది. అయితే గతంలో సేకరించిన కొంత భూమికి రూ.135 కోట్ల పరిహారం విడుదలకు ఇటీవల పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అలాగే, మొత్తం భూసేకరణ రెండు నెలల్లో పూర్తి చేయాలని సూచించిన నేపథ్యాన అంతా అనుకున్నట్టు జరిగితే ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగనుంది.

6.74 లక్షల ఎకరాల సాగు..

సీతారామ ప్రాజెక్టు నిర్మాణం 2016లో రూ.7,926.14 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైంది. ఆ తర్వాత పలుమార్లు అంచనాలను సవరించగా, 2025లో రూ.19,324.92 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టు కింద 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు నూతన ఆయకట్టు 3.29 లక్షల ఎకరాలు ఉంటుందని ప్రకటించారు. ఎనిమిది డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలు, నాలుగు పంప్‌హౌస్‌లు ప్రతిపాదించారు. ప్రాజెక్టులో సాగునీటికి 63.13 టీఎంసీలు, తాగునీటికి 2.12 టీఎంసీలను కేటాయించనున్నారు. ఇప్పటికే భద్రాద్రి జిల్లాలోని బీజీ కొత్తూరు, వీకే రామవరం, కమలాపురం పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తవగా వైరా రిజర్వాయర్‌కు నీరు విడుదల చేశారు. దమ్మపేట మండలం గండుగులపల్లి వద్ద నాలుగో పంపుహౌస్‌ పనులు కొనసాగుతున్నాయి.

అనువైన చోట చకచకా..

ప్రాజెక్టు పరిధిలో 1 నుంచి 8 ప్యాకేజీల వరకు ప్రధాన కాల్వల నిర్మాణం పూర్తయ్యాయి. జూలూరుపాడు టన్నెల్‌ పనులు మొదలుకావాల్సి ఉంది. అలాగే 9 నుంచి 12 ప్యాకేజీల్లో సత్తుపల్లి మెయిన్‌ కెనాల్‌ (యాతాలకుంట టన్నెల్‌తోసహా), బేతుపల్లి, దమ్మపేట బ్రాంచ్‌ కెనాళ్లు, పాలవాగు మెయిన్‌ కెనాల్‌, వినాయకపురం, గొల్లగూడెం కెనాళ్లు ఉన్నాయి. ఈ ప్యాకేజీల్లో 115.86 కి.మీ.కు గాను 75.56 కి.మీ. మేర కాల్వల నిర్మాణం పూర్తయింది. యాతాలకుంట టన్నెల్‌ తవ్వకం పూర్తయి లైనింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. ఇక 13 నుంచి 16 ప్యాకేజీల్లో ఉన్న పాలేరు లింక్‌ కెనాల్‌లో 66.974 కి.మీ.కు గాను 27.474 కి.మీ. తవ్వకం పూర్తయింది. పాలేరు టన్నెల్‌లో 8.50 కి.మీ.కు గాను నాలుగు కి.మీ. పైగా పూర్తయ్యాయి.

ప్రధాన దృష్టి..

ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణకే ప్రాధాన్యత ఇవ్వాలని తాజాగా పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బకాయిల చెల్లింపునకు రూ.135 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. మంత్రుల సూచనలతో సర్వే వేగంగా పూర్తయి భూసేకరణ ఓ కొలిక్కి వస్తే సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు జోరందుకోనున్నాయి.

ప్రాజెక్టుకు భూసేకరణ

పెండింగ్‌

సీతారామ ప్రాజెక్టులో ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీలకు భారీగా భూమి అవసరం. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూమి 10,069.29 ఎకరాలకు తోడు అటవీ భూ ములు 808 ఎకరాల వరకు కావాలి. ఇందులో కిన్నెరసాని వంటి ఎకో సెన్సిటివ్‌ జోన్లు ఉండడం, పోడు, అటవీ భూముల ద్వారా కాల్వలు తవ్వాల్సి ఉంది. వీటికి అటవీ శాఖ అనుమతులు సాధించడం, గిరిజనులకు పరిహారం చెల్లింపు సవాల్‌గా మారింది. పంపుహౌస్‌లతో పాటు 1–8 ప్యాకేజీల్లో ప్రధాన కాల్వల నిర్మాణానికి 80 శాతం వరకు భూసేకరణ పూర్తయినా, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు పెండింగ్‌ ఉంది. ఫలితంగా గత ఏడాదే టెండర్లు పిలిచినా ఫలితం లేదు. కాగా, ఖమ్మం జిల్లాలో 1,877.66 ఎకరాలు, భద్రాద్రిలో 6,399.53 ఎకరాలు రైతుల నుంచి సేకరించాల్సిఉండగా, రెండు జిల్లాల్లో కలిపి 2,107.21 ఎకరాల్లో సర్వే పూర్తయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement