లక్ష్యం చేరుకునేనా?
జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం
(ఎకరాల్లో...)
జిల్లాలో లోటు వర్షపాతమే
అంటున్న వాతావరణ శాఖ
తగ్గుముఖం పట్టిన వరి, మొక్కజొన్న పంటల సాగు
అపరాల పంటల సాగు పెంపునకు యాక్షన్ ప్లాన్
వరి, మక్కలకు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త యాక్షన్ ప్లాన్ రూపొందించింది. జూలైలో జిల్లాలో గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, జూ లురుపాడు, చండ్రుగొండ మండలాల్లో సాధారణ వర్షపాత నమోదయ్యే అవకాశం ఉందని, మిగిలిన మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. ఆ తర్వాత వచ్చే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జిల్లావ్యాప్తంగా లోటు వర్షపాతమే నమోదు కాబోతుందని వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్నాయి. వర్షాలు తగ్గితే భూగర్భ జలాలు కూడా తగ్గిపోతాయి. మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులైన కిన్నెరసాని, తాలిపేరు, పెద్దవాగులకు ఆశించిన వరద లేదు.
సగం మారాలి
ఎల్‌నినో దృష్ట్యా నీటిని అధికంగా ఉపయోగించే వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాల పంటలను భారీ స్థాయిలో సాగు చేయించేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులతో పోల్చి చూస్తే అపరాల సాగు పెంచడం వ్యవసాయ అధికారులకు సవాల్‌గా మారింది. గత ఖరీఫ్‌లో జిల్లాలో 6,09,250 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో ఉద్యాన, అగ్రోఫారెస్ట్రీని మినహాయిస్తే ఇతర పంటలు 4,85,553 ఎకరాల్లో వేశారు. అత్యధికంగా 2,19,445 ఎకరాల్లో పత్తి సాగైంది. ఆ తర్వాత వరి పంట 1,69,253 ఎకరాల్లో, మొక్కజొన్న 90,886 ఎకరాల్లో సాగు చేశారు. ఈ మూడు పంటలే 99 శాతం వ్యవసాయ భూముల్లో పండించారు. జిల్లా వ్యాప్తంగా సగం మంది రైతులకు అలవాటైన వరి నుంచి ఒక్కసారిగా ఇతర పంటలవైపు మళ్లించాల్సి ఉంటుంది.
వేచి చూస్తున్నారు
ఎల్‌నినో కారణంగా వరి పండించే రైతులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. గత సీజన్‌లో 1.69 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, జూలై 15 వరకు కేవలం 30 వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. కొనుగోళ్లలో ఎదురైన ఇబ్బందులతో గత సీజన్‌లో 90 వేల ఎకరాల్లో సాగైన మొక్కజొన్న ఈసారి 57 వేల ఎకరాలకు పడిపోయింది. యథావిధిగా పత్తి రికార్డు స్థాయిలో రెండు లక్షలకు పైగా ఎకరాల్లో సాగువుతోంది. మొత్తంగా జూలై 15 నాటికి 1,48,889 ఎకరాల్లో ఇంకా వ్యవసాయ పనులు మొదలు కాలేదు. దీంతో తగ్గుముఖం పట్టిన వరి, మొక్కజొన్నల సాగుకు సంబంఽధించిన 1,38,198 ఎకరాల్లో ఆపరాల పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్‌లో పేర్కొంది.
కందులు, పెసర, మినుములు వంటి అపరాల పంటలు, కూరగాయల విషయంలో వ్యవసాయశాఖ నిర్దేశించుకున్న లక్ష్యానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య ప్రస్తుతం పొంతన కుదరడం లేదు. నిర్దేశిత స్థాయిలో కందిసాగుకు 1,955 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉండగా, జిల్లాలో ప్రస్తుతం 105 క్వింటాళ్ల విత్తనాలే అందుబాటులో ఉన్నాయి. 32 క్వింటాళ్ల కూరగాయల విత్తనాలు అవసరం కాగా, ప్రస్తుతం 2 క్వింటాళ్లే వ్యవసాయశాఖ, బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇతర అపరాల పంటల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సవాళ్లను దాటుకుని పప్పు ధాన్యాల సాగును పెంచాల్సి ఉంది.
పంట ఈ ఏడాది గతేడాది
లక్ష్యం సాగైన విస్తీర్ణం
కందులు 48,878 596
పెసర 6,516 160
మినుములు 7,995 1940
మొక్కజొన్న 51,948 90,886
జొన్నలు 2,982 ––
చెరకు 1,291 53
కూరగాయలు 6,530 575
ఇతర 13,349 230


