జిల్లాలో తేలికపాటి వానలు
వరిసాగుకు మాత్రం అనుకూలించని వరుణుడు
ప్రత్యామ్నాయ పంటలపై
వ్యవసాయశాఖ దృష్టి
బూర్గంపాడు: జిల్లావ్యాప్తంగా కురుస్తున్న తేలికపాటి వర్షాలు మెట్ట పైర్లకు ఊపిరి పోశాయి. మొన్నటి వరకు వడలిపోయిన పత్తి మొక్కలు, మొక్కజొన్న, వరినార్లు ప్రస్తుత వానతో ప్రాణం పోసుకున్నాయి. రెండు రోజులుగా ఓ మోస్తరు వర్షం కురుస్తున్నా వరి సాగుకు మాత్రం అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. కొన్నిచోట్ల నార్లు సిద్ధంగా ఉన్న దమ్ము చేసుకునేందుకు సరిపడా సాగునీరు లేదు. కేవలం ఒకటి, రెండు సెం.మీ. వర్షపాతమే జిల్లాలో నమోదవుతోంది. ఎక్కడ కూడా చెరువులు, కుంటలకు నీరు చేరకపోవడం.. భూగర్భజలాలు అడుగంటి బోర్ల నీరు సరిగా అందడం లేదు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేలా అవగాహన కల్పిస్తున్నారు.
రెండు, మూడు విడతలుగా పత్తి
జిల్లాలోని పలు మండలాల్లో ఇప్పటి వరకు లోటు వర్షపాతమే నమోదైంది. జూన్‌లో కురిసిన ఒకట్రెండు వర్షాలకు రైతులు మెట్ట పంటలు సాగు చేయడమే కాక వరి నార్లు పోశారు. తొలిసారి వేసిన పత్తి గింజలకు భూమిలో పదును సరిపడక మొలకెత్తలేదు. దీంతో కొందరు రెండు, మూడు సార్లు నాటడంతో మొలకెత్తాయి. కానీ ఈనెలారంభం నుంచి వర్షాలు లేక పత్తి మొక్కలు వడలిపోయి, వరినార్లు ఎండుముఖం వేశాయి. గత మూడురోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తుండడం మెట్ట పైర్లకు జీవం పోసినట్లయింది. జిల్లాలో ఈ సీజన్‌లో 2.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా.. ఇప్పటివరకు సుమారు 1.60 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వరిసాగు 1.90 లక్షల ఎకరాలకు గాను ఇప్పటి వరకు కేవలం ఐదు వేల ఎకరాల్లోనే నాట్లు పూర్తయ్యాయి. చెరువులు, కుంటలు నిండకపోవటం, సాగునీరు విడుదల చేయకపోవడంతో వరి సాగు గణనీయంగా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది.
వరి కాకపోతే పత్తి
ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యాన ఈ ఏడాది వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయశాఖ విస్తృత అవగాహన కల్పిస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అపరాలు, నూనెగింజల పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. కానీ రైతులు మాత్రం వరికి బదులు మొక్కజొన్న, పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు రైతులు మాగాణి భూముల్లోనూ పత్తి గింజలు నాటడంలో నిమగ్నమయ్యారు. ఇంకొందరు వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వరి తగ్గుతుందా..
వాణిజ్య పంటల సాగు ఏటా నష్టాలను మిగులుస్తుండడంతో చాలామంది రైతులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. వరి పండించినా యాసంగిలో సరిగా కొనక రైతులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఈసారి వరికి స్వస్తి చెప్పి పలువురు మళ్లీ జామాయిల్ సాగుకు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నా చాలామంది జామాయిల్ వైపు దృష్టి పెట్టడం గమనార్హం. ఈ నేపథ్యాన ఆయిల్‌పామ్ సాగుకు ముందుకొచ్చేలా అధికారులు మరింత అవగాహన కల్పిస్తే ఫలితం ఉంటుంది.


