● తొమ్మిది రాష్ట్రాల్లో పూర్తయిన నేపాల్ వాసి ప్రయాణం ● తెలంగాణ మీదుగా ఒడిశాకు పయనం
భద్రాచలంఅర్బన్: రూపాయి ఖర్చు పెట్టకుండా భారతదేశమంతా తిరగాలని.. ప్రజల ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలను తెలుసుకునేలా నేపాల్ దేశానికి చెందిన దుర్గా పాండే సైకిల్‌పై చేపట్టిన యాత్ర భద్రాచలం చేరుకుంది. గత ఏడాది నవంబర్ చివరలో నేపాల్ నుంచి సైకిల్‌పై భారత్‌దేశంలో అడుగుపెట్టిన ఆయన యాత్ర తొమ్మిది రాష్ట్రాల్లో పూర్తికాగా.. ఒడిశా వెళ్తూ మంగళవారం భద్రాచలంలో కాసేపు ఆగాడు. ఈ సందర్భంగా ఆయన తన యాత్ర అనుభవాలను పంచుకున్నాడు.
ఆసక్తితో..
నేపాల్‌లోని రూపన్‌దేహి జిల్లా దేవ్‌దహా మున్సిపాలిటీ పరిధి బుద్ధనగర్ ప్రాంతానికి చెందిన రిషిరాం పాండే – లక్ష్మి కుమారుడు దుర్గా పాండే. ఇంటర్‌మీడియట్ వరకు నేపాల్‌లో చదివాక.. స్వస్థలంతో పాటు మహారాష్ట్రలోని హోటళ్లలో కొన్నాళ్లు పనిచేశాడు. అనంతరం భారత్‌దేశం అంతా సైకిల్‌పై యాత్ర చేయాలనే ఉద్దేశంతో 2025 నవంబర్‌లో ప్రారంభించి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిచేశాడు. ఆ తర్వాత తెలంగాణలోకి ప్రవేశించిన పాండే అచ్చంపేట మీదుగా హైదరాబాద్ వెళ్లాడు. యాత్ర అంతా సాఫీగా జరిగినా.. హైదరాబాద్‌లో గోల్కొండ కోట సందర్శనకు వెళ్లినప్పుడు ఫోన్, కెమెరాల చోరీ జరగడం బాధ కలిగించిందని వివరించాడు. అనంతరం హైదరాబాద్ నుంచి ఒడిశాలో పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్తూ భద్రాచలంలో ఆగానని వెల్లడించాడు. ఇప్పటివరకు 235 రోజుల్లో సుమారు 5 వేల కి.మీ. మేర యాత్ర పూర్తయిందని వెల్లడించిన పాండే.. మార్గమధ్యలో ప్రజలే భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారని వివరించాడు.


