● శిల్పకళా స్తంభాల తరలింపునకు ప్రయత్నాలు ● 45 ఏళ్లుగా అనేక ఉత్సవాలకు సాక్షి
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు వేగవంతంగా సాగుతున్నా యి. ఇప్పటికే ఉత్తర ద్వారం, కుసుమ హరనాథబాబా ఆలయం, వంటశాలను పూర్తిగా తరలించారు. చిత్రకూట మండపాన్ని తొలగించే చర్యలు కూడా ముమ్మరమయ్యాయి. మండపంలోని శిల్పాకళా స్తంభాలు, ఇతర కళాత్మక దృశ్యాలను కొత్తగా నిర్మించే చిత్రకూట మండపంలో తిరిగి ప్రతిష్టించాలని అధికారులు భావించారు. దీంతో ఆ స్తంభాలు దెబ్బతినకుండా భద్రపర్చాలని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్లాబును కార్మికులతో డ్రిల్లింగ్ చేయిస్తూ, ఒక్కో భాగాన్ని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. మండపానికి ముందు, వెనుక భాగంలో ఉన్న ద్వారాలను తొలగించారు. పిల్ల ర్లుకు సైతం నంబర్లను రాసి, ధ్వంసం కాకుండా పూర్తిగా కవర్‌చేశారు. చిత్రకూట మండపం పూర్తిగా తొలగించేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
నాలుగు దశాబ్దాల చరిత్ర..
శ్రీ భద్రాచల సీతారామాలయ ఉద్దరణ సంఘం ఆధ్వర్యంలో నాటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ చేతుల మీదుగా జూలై 15, 1967లో చిత్రకూట మండపానికి శంకుస్థాపన చేశారు. 1982 ఏప్రిల్ 4న నాటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పీవీ చౌదరి ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక ఉత్సవాలకు సాక్షిగా నిలిచింది. పూర్వకాలంలో శ్రీరామనవమికి, భక్త రామదాసు జయంతి ఉత్సవాలకు, రద్దీగా ఉన్న సమయంలో నిత్యకల్యాణాలకు, సత్యనారాయణస్వామి సామూహిక వ్రతా లకు, పెళ్లి కొడుకు వేడుకగా భావించే హోలి రోజున జరిగే తలంబ్రాలు కలిపే వేడుక, లడ్డూల తయారీలో, ప్రతీ నెల జరిగే ఆలయ హుండీ లెక్కింపు అన్నింటికి చిత్రకూట మండపమే వేదిక. అలాంటి విశిష్టత కలిగిన వేదిక కొద్దిరోజుల్లో నేలమట్టం కానుంది.


