రామయ్య కల్యాణం... కమనీయం | - | Sakshi
Sakshi News home page

రామయ్య కల్యాణం... కమనీయం

Jul 21 2026 12:17 AM | Updated on Jul 21 2026 12:17 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం రామయ్య స్వామి నిత్యకల్యాణం పరమానందంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

సింగరేణిలో ఇంటర్నల్‌ నోటిఫికేషన్‌

రుద్రంపూర్‌: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్నల్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ మేరకు పర్సనల్‌ (రిక్రూట్‌మెంట్‌ సెల్‌) విభాగం జీఎం ఏజే మురళీధర్‌రావు సోమవారం వివరాలు వెల్లడించారు. ఫిట్టర్‌ ట్రైనీ కేటగిరీ–1లో 96 పోస్టులు, ఎలక్ట్రీషియన్‌ కేటగిరీ–1లో 63 పోస్టులను అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, హార్డ్‌కాపీతో పాటు అవసరమైన అన్ని రకాల జిరాక్స్‌ కాపీలను ఆగస్టు 8న జీఎం కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. హార్డ్‌ కాపీలను ఏరియా కార్యాలయం నుంచి ఆగస్టు 11లోగా సంస్థ ప్రధాన కార్యాలయానికి పంపాలని తెలిపారు.

‘ఎడవల్లి’కి గౌరవ డాక్టరేట్‌

కొత్తగూడెంఅర్బన్‌: న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటా సెంటర్‌లో జరిగిన ఇండో ఇంటర్నేషనల్‌ ఇంటెలెక్చువల్‌ కాన్‌క్లేవ్‌ వేడుకల్లో మదర్‌ థెరిసా కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ – టెక్నాలజీ (పెద్దపల్లి) వ్యవస్థాపక చైర్మన్‌ ఎడవల్లి కృష్ణ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నాడు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు. అమెరికాకు చెందిన మేరీల్యాండ్‌ స్టేట్‌ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ చేతుల మీదుగా డాక్టరేట్‌ స్వీకరించినట్లు తెలిపారు. విద్యారంగంలో, లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా డాక్టరేట్‌ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు లయన్స్‌క్లబ్‌ సభ్యులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

వరి నారుకు నూకలు

చండ్రుగొండ: రైతులు వరినారు సస్యరక్షణకు నూకలు(బియ్యం) చల్లుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఓ రైతు వరి నారులో నూకలు చల్లిన ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో జిల్లాలోనూ పలువురు నారుమళ్లలో నూకలు చల్లుతున్నారు. దీనివల్ల నారుమడి సారవంతం కావడంతో పాటు కలుపు నివారణ, మడిలో వానపాములు (ఎర్రలు) పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. కాగా, వాస్తవమేనని ఏఓ వినయ్‌ను తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement