పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచీ తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజాది కార్యక్రమాల్లో వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
అంచనాల కమిటీ
చైర్మన్‌గా ఎమ్మెల్యే కనకయ్య
ఇల్లెందు: శాసన సభ, శాసన మండలి అంచనాల కమిటీ చైర్మన్‌గా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. కమిటీ సభ్యులుగా సునీతా లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాలోతు రాందాస్, ఎం యశశ్వినిరెడ్డి, పి.రాకేష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుంకరి రాజు, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, వంటేరు యాదవ రెడ్డి తదితరులను నియమించారు. కనకయ్య నియామకంపై ఇల్లెందు కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు బోళ్ల సూర్యం, మండల రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ డి.కిరణ్ మిత్ర హర్షం వ్యక్తం చేశారు.
బాస్కెట్ బాల్
ఎంపికలు
పాల్వంచ: పట్టణంలోని కేటీపీఎస్ కాలనీలో ఉన్న బాస్కెట్ బాల్ క్రీడా మైదానంలో ఆదివారం జిల్లా జట్లను ఎంపిక చేశారు. పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల నుంచి సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు నిత్యం సాధన చేస్తూ పోటీల్లో ప్రతిభ చాటాలని అన్నారు. నిర్వాహకులు రాకేష్, సురేష్, మునీర్, జగదీష్, సాయిచరణ్, స్నేహిత్, కీర్తన్, సాయికిరణ్, సుమంత్, హర్ష, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఐటీడీఏలో గిరిజన దర్బార్..
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని సూచించారు.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో...
సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు.


