పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట
విడతలో ఎంపిక చేసిన గ్రామాలు
70 గ్రామాల్లో 64 వేల ఎకరాలను సర్వే చేయాలని నిర్ణయం
తొలి విడతలో 14 గ్రామాల్లో 7,034 ఎకరాల 9 కుంటలు..
నాలుగు రోజుల క్రితం పాల్వంచలో డిజిటల్ సర్వే ప్రారంభం
పాల్వంచరూరల్: భూ భారతి చట్టం ప్రకారం భూముల హద్దులు, వివాదాల పరిష్కారానికి సాంకేతిక యంత్రాల ద్వారా భూ రీ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలో 70 గ్రామాల్లో 64 వేల ఎకరాలను సర్వే చేయనుంది. మొదటి విడతగా 14 గ్రామాల్లో 7,034 ఎకరాల 9 కుంటలను సర్వే చేయాలని నిర్ణయించింది. తొలుత పాల్వంచ మండలం కారెగట్టు గ్రామ పంచాయతీ సారెకల్లు గ్రామంలో నాలుగు రోజుల క్రితం అధికారులు భూ రీ సర్వే చేపట్టారు. సర్వేకు 14 మంది ప్రభుత్వ సర్వేయర్లు, లైసెన్స్ పొందిన సర్వేయర్లు 206మందితో కలిపి ఐదు బృందాలను ఏర్పాటు చేసింది. డిజిటల్ సాంకేతిక సర్వే విధానంపై వీరికి శిక్షణ కూడా ఇచ్చారు. సర్వే ప్రక్రియను తహసీల్దార్ దారా ప్రసాద్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కలెక్టర్ అంకిత్ పర్యవేక్షిస్తున్నారు.
మ్యాప్, భూధార్ నంబర్ల కేటాయింపు
డిజిటల్ భూ రీ సర్వేలో ఏ సర్వే నంబర్‌లో ఎంత భూమి ఉంది? ఎన్ని పట్టాలు ఉన్నాయి.? ఎవరు సాగు చేస్తున్నారు? తదితర వివరాలు సేకరిస్తారు. ప్రతీ హక్కుదారుడైన రైతుకు భూమికి హద్దులు నిర్దేశించి డిజిటల్ మ్యాప్‌ను రూపొందిస్తారు. ఆ తర్వాత భూమి విస్తీర్ణ మ్యాప్‌తోపాటు భూధార్ నంబర్ కేటాయిస్తారు.
మొదటి దశలో ప్రభుత్వ భూములు..
జిల్లా భూమి కొలతలు, రికార్డుల శాఖ ఏడీ పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానంతో (రోవర్ యంత్రం ద్వారా) డిఫెరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టం (డీజీపీఎస్)తో ప్రక్రియ సర్వే నిర్వహిస్తారు. ఎంపిక చేసిన గ్రామంలో హద్దులను నిర్దేశించి, ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులను సర్వే చేస్తారు. సర్వే బృందంలో మండల సర్వేయర్‌తోపాటు ఆర్‌ఐ, జీపీఓలు ఉంటారు. గ్రామంలో హద్దుల ఏర్పాటుకు స్థానికులతో కలిసి బండరాళ్లు నాటుతారు. తర్వాత ప్రభుత్వ భూమి ఎంత ఉంది? కబ్జాలో ఎంత ఉంది? సాగు భూమి ఎంత? సాగుచేయని భూమి ఎంత? పంట కాలువలు, కుంటలు, చెరువులు, బావులు, రహదార్లు తదితర వివరాలతో సర్వే చేసి మ్యాప్ తయారుచేస్తారు. గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు ఉన్న భూమి విస్తీర్ణాన్ని సర్వే చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పట్టా భూముల విస్తీర్ణాన్ని సర్వే చేస్తారు.
డిజిటల్ భూ రీసర్వే ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూ హద్దుల సమస్యలు, వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో డిసెంబర్ వరకు భూ రీ సర్వే జరుగుతుంది. దీంతోపాటు నాలుగు నెలల నుంచి నక్ష ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నాం. ఇది మణుగూరులో బేస్‌డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేషన్ సర్వే కింద కొనసాగుతోంది. – శ్రీనివాస్,
భూమి కొలతల రికార్డుల శాఖ జిల్లా అధికారి, ఏడీ
పాల్వంచ: సారెకల్లు, రేపల్లెవాడ, కోయగట్టు, గుండాల : కోనావారిగూడెం, పినపాక: బొమ్మరాజుపల్లి, సీతారాంపురం, సున్నంవారిగూడెం, బూర్గంపాడు: పినపాక, ఇరవెండి, దుమ్ముగూడెం : గుర్రాలబయలు, ములకనపల్లి, లింగాపురం, సంగం, వీరాపురం


