పర్చూరు (చినగంజాం): రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో అధికార పార్టీకి చెందిన కొందరు దురుద్దేశంతో కుట్రపూరిత చర్యలకు తెరతీశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పావులూరులోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ వ్యక్తులు తమ బూటకపు ఎత్తుగడల్లో భాగంగా ఇటీవల కాలంలో ఐవీఆర్‌ఎస్ సర్వే పేరుతో ఓటర్లకు నేరుగా ఫోన్ కాల్ చేసి అభిప్రాయ సేకరణ నిర్వహిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు తెరలేపారన్నారు. నియోజకవర్గంలోని పలువురు ఓటర్లు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించడంతోపాటు విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.
స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం..
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తుందని, తర్వాత సాధారణ ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు తమ బూటకపు ఫోన్ కాల్స్ ద్వారా నియోజకవర్గంలో మధుసూదనరెడ్డి పనితీరు, అక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఆయనే ఉండాలా? మార్చాలా? ఫలానా వ్యక్తికి ఇన్‌చార్జ్‌గా పెట్టి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? వంటి పలు ప్రశ్నలను ఓటర్లను అడగటం ద్వారా చీప్ ట్రిక్స్ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కాల్స్ రావని, కొందరు అధికార పార్టీలోని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఆడుతున్న నాటకమని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఈ కుట్రను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.


