చోరీ కేసులో నిందితుడు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుడు అరెస్టు

Jul 22 2026 1:29 AM | Updated on Jul 22 2026 1:29 AM

● ప్రాథమిక విచారణలో నిందితుడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, ఇతర చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడైంది. నేరం జరిగిన స్వల్ప వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్‌ చేసిన ఎస్‌ఐ కె. మాధవరావు, హెడ్‌ కానిస్టేబుళ్లు వాకా శ్రీనివాసరావు, డి.సోమయ్య, హోంగార్డు రామకృష్ణలను జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

రూ.2.23లక్షల విలువైన సొత్తు రికవరీ 24 గంటల్లోనే కేసు ఛేదించిన చందోలు పోలీసులు

కర్లపాలెం: చందోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పిట్టలవానిపాలెం మండలం రెడ్లపాలెం గ్రామంలో జరిగిన చోరీ కేసును చందోలు పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుడిని అరెస్ట్‌ చేసి, చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం చందోలు పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ కె.మాధవరావు కేసు వివరాలు వెల్లడించారు.. పిట్టలవానిపాలెం మండలం రెడ్లపాలెం గ్రామానికి చెందిన ముచ్చు సుబ్బారావమ్మ ఈనెల 8వ తేదీన ఇంటికి తాళం వేసి వరి నాట్ల కూలీ పనుల నిమిత్తం నల్గొండకు వెళ్లారు. 9వతేదీన మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాను ధ్వంసం చేసి ఇంటి అంతటా కారం పొడి చల్లివేసినట్లు స్థానికులు ఆమెకు సమాచారం అందించారు. దీంతో ముచ్చు సుబ్బారావమ్మ 20వతేదీన ఉదయం ఇంటికి వచ్చి పరిశీలించగా, ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.2,23,000 విలువగల రెండు సవర్ల బంగారు చైన్‌, ఏడు తులాల వెండి పట్టీలు, గోకతాడు దొంగిలించబడినట్లు గుర్తించారు. దీనిపై చందోలు పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. బాపట్ల రూరల్‌ సీఐ బి.హరికృష్ణ పర్యవేక్షణలో, చందోలు ఎస్‌ఐ కె.మాధవరావు నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా 21 సాయంత్రం 4.30 గంటల సమయంలో పిట్టలవానిపాలెం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద రెడ్లపాలెం గ్రామానికే చెందిన పిట్టు వెంకట శివారెడ్డి (34)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన వస్తువులన్నీ స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేశారు. అనంతరం నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement