కోవిడ్ సమయంలో ఎందరో ప్రాణాలు నిలిపిన వైనం పట్టించుకోని పాలకులు, అధికారులు కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగంలోకి తేవాలని కోరుతున్న ప్రజలు
త్వరలో వినియోగంలోకి...
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు
రేపల్లె ఆస్పత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్
రేపల్లె: కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ప్రాణాలను నిలిపిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ నేడు నిరుపయోగంగా మారి మూలన పడింది. ప్రాణాలకు సంబంధించిన అత్యవసర సదుపాయాన్ని కూడా మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన పాలకులు, అధికారుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం ఉప్పొంగుతోంది. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వైద్య వర్గాలు హెచ్చరిస్తుండగా ఇలాంటి కీలక ప్లాంట్‌ను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ప్రజలు, ప్రజాసంఘాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ఆక్సిజన్ ప్లాంట్‌కు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రాణదాతగా నిలిచిన ప్లాంట్
కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సకాలంలో ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిన దుర్భర స్థితులను చూశాం. ఆ సమయంలో రేపల్లెలో సరైన వైద్య సదుపాయాలు లేక పలువురిని తెనాలి, గుంటూరు ప్రాంతాలకు తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో స్థానికంగానే ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచింది.
ఆస్పత్రిలోని ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ మరమ్మతులకు గురైంది. దాని పునరుద్ధరణకు ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం రోగులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే ప్లాంట్‌కు మరమ్మతులు చేయించి, వినియోగంలోకి తీసుకువస్తాం.
– కొలసాని పృథ్వీ గణేష్, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్
పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో 2022 జనవరి 21న అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రేపల్లె రెడ్ క్రాస్ సొసైటీ, హిందుస్థాన్ కోకో కోలా బెవరేజెస్ సంస్థల సహకారంతో ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పలువురికి ఆక్సిజన్ అందిస్తూ ప్రాణాలను నిలబెట్టింది.. కోవిడ్ సమయంలో క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందిన వారికి కూడా ఆక్సిజన్ సరఫరా చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్లాంట్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


