కొల్లూరు: ఉద్యాన పంటల సాగుపై ఆధారపడిన రైతులు ప్రభుత్వం ద్వారా రాయితీ అందే పంటల సాగుకు మొగ్గు చూపాలని, దీంతో అధిక దిగుబడులతోపాటు, సబ్సిడీ రూపంలో నగదు ప్రతి ఫలం చేకూరుతందని జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎస్‌ఎంకే ఖలీమ్ అన్నారు. మంగళవారం మండలంలోని చిలుమూరు, ఈపూరు గ్రామాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు నిర్వహించిన ఒక్క రోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. టిష్యూ కల్చర్ అరటి హెక్టార్‌కు రూ. 70 వేలు, హైబ్రిడ్ కూరగాయల పంటలకు హెక్టార్‌కు రూ. 24 వేలు చొప్పున ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. అరటి సాగులో టిష్యూ కల్చర్ మొక్కలను వినియోగించడం వల్ల వ్యాధి రహిత మొక్కలు అందుబాటులో ఉండి అధిక దిగుబడులకు ఆస్కారం ఉంటుందన్నారు. వ్యవసాయానికి వినియోగించే మినీ ట్రాక్టర్, పవర్ వీడర్, తైవాన్ స్ప్రేయర్ వంటి వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. శాస్త్రవేత్త కె.వెంకటసుబ్బయ్య పసుపు, కంద పంటలలో తెగుళ్ల నివారణ, సస్యరక్షణ చర్యలను వివరించారు. మండల ఉద్యాన శాఖాధికారి జి.కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.


