తెనాలిటౌన్ : లోక కల్యాణార్థం ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శ్రీ పరంజ్యోతి భగవతి పద్మావతి అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అచ్యుత దాసాజీ పేర్కొన్నారు. తెనాలి రూరల్ మండలం బుర్రిపాలెంలోని శ్రీకల్కి సేవ ఆలయంలో మంగళవారం తెనాలి, బుర్రిపాలెం, పరిసర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు హాజరై భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించారు. అచ్యుత దాసాజీ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కరవు, కాటకాలను పోగొట్టి, లోక సమృద్ధిని కాంక్షిస్తూ వర్షాలను ప్రసాదించమని కోరుతూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): పర్యావరణ పరిరక్షణ ప్రతి విద్యార్థి సామాజిక బాధ్యతగా స్వీకరించాలని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) విభాగం, ధరిత్రీ సంరక్షణ చైతన్యం సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ప్లాంట్ ప్రొటెక్షన్ ఛాలెంజ్ వాల్‌పోస్టర్‌ను వర్సిటీ వీసీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు ప్రకృతిని ప్రేమిస్తూ, బాధ్యతతో వ్యవహరించినప్పుడే సుస్థిర సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్ ఆచార్య బబిత, ధరిత్రీ సంరక్షణ చైతన్యం సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై మంగళవారం తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళా శాసనాలతో సుదర్శన పెరుమాళ్ళ వారికి తిరునక్షత్ర మహోత్సవం వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఉదయం పంచామృతాలతో స్వామివారికి అభిషేకం, 10 గంటలకు సుదర్శన హోమం, పూర్ణాహుతి, మంగళశాసనం, వేద ఆశీర్వవచనం, తీర్థ ప్రసాద గోష్టి గావించామని తెలిపారు. 27 అడుగుల ఏకశిలా శ్రీ విఘ్న విమోచక హనుమాన్‌కు మల్లెలతో సహస్రనామార్చన జరిగిందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు.
మాచర్ల: ఆషాఢ మాసం సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ అమ్మవారికి మంగళవారం రెండవ రోజు బోనాల సమ ర్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం మాచర్లలోని రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి వందలాది మంది మహిళలు దేవాలయం వద్దకు చేరుకొని మైసమ్మకి ప్రత్యేక పూజలు చేశారు. నాయీ బ్రాహ్మణులు, సంఘ పెద్దలు మాచర్ల వెంకటేశ్వర్లు, కృష్ణ, శ్రీనివాస్, హనుమంతరావు, పలువురు పెద్దల ఆధ్వర్యంలో ఊరేగింపు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు కోలాట ప్రదర్శన చేసి ఊరేగింపు జరుపుతూ మైసమ్మ తల్లికి జేజేలు పలికారు.


