తీరం తరిగిపోతోంది. అక్రమార్కులు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుండటంతో పెనుముప్పు కలిగే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిసార్ట్ యజమానులు, రియల్టర్లు కలిసి ఇక్కడి అటవీ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వంలో కనీస చలనం కలగడం లేదని తీర ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేటపాలెం: అటవీ భూముల్లో సరుగుడు తోటల పెంపకం ఓ తంతుగా మారింది. అటవీ అధికారుల నిర్లక్ష్యంతోపాటు కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు సిబ్బంది తీరుతో తీరప్రాంత గ్రామాల మధ్య చిచ్చు రగులుతోంది. ఫలితంగా తుఫాన్‌లు, ఉప్పెనలు, సునామీ వంటి ఉపద్రవాల సమయంలో ముంపు నుంచి కాపాడే సరుగుడు తోటలు కనుమరుగై పోతున్నాయి.
అసలు ఉద్దేశం ఇదీ..
జిల్లాలో 112 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో అనేక మత్స్యకార గ్రామాలు తీరంపై అధారపడి జీవిస్తున్నాయి. అందరికీ ప్రధానంగా చేపల వేటే జీవనాధారం. తీర రక్షణకు బీచ్ వెంట అటవీ శాఖ సరుగుడు తోటలు పెంచుతోంది. 2007 వరకు కొనసాగినా.. అ తరువాత సరుగుడు తోటల పెంపకాన్ని మత్స్యకార గ్రామాలకు వదిలేశారు. కేవలం ఆదాయ వనరులుగానే తోటలను పెంచుతున్నారు. ఒకసారి పెంచిన సరుగుడు తోటలను ఎనిమిది సంవత్సరాల వరకు కొట్టివేయకూడదు. వీటిని కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. తోటల పెంపకంలో గ్రామాల మధ్య సరిహద్దుల సమస్య తలెత్తినప్పటికీ ఆశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.


