బాపట్ల: నేటి విద్యార్థులే దేశ భవిష్యత్ నిర్దేశకులని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వీ కన్వెన్షన్ హాలులో విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ – 2026 కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మున్ముందు ఉత్తీర్ణత శాతం పెంచడానికి అందరూ కృషి చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ టెన్త్‌లో 128 మంది, ఇంటర్‌లో 27 మంది విద్యార్థులకు రూ.20 వేల చొప్పున నగదు బహుమతి, ప్రశంసాపత్రం, పతకం అందించామని చెప్పారు. పదో తరగతి పరీక్షల్లో కొల్లూరు మండలం నుంచి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ రావడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఆ విద్యార్థిని, తల్లిదండ్రులకు ఆయన అభినందనలు తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ రాజు, బావుడా చైర్మన్ రాజశేఖర్‌బాబు, ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలకపూడి పాపారావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చూపుల దుర్గాప్రసాద్, డీఈఓ శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు.
‘ఎల్‌నినో’పై అవగాహన కల్పించాలి
బాపట్ల: ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక పురపాలక సంఘ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ... ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, వర్షాలు పడే అవకాశం తక్కువని రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఎరువుల నిల్వపై ఆరా తీశారు. నిబంధనల ప్రకారం ఎరువులను విక్రయించాలని, లేకుంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యాన పంటల సాగు, వాటి దిగుబడి, ఎరువుల వినియోగం గురించి తెలుసుకున్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని తెలిపారు. గోడౌన్లు పరిస్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారిణి శ్రీలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఖలీం, మార్క్‌ఫెడ్ ఎండీ కరుణశ్రీ , ఇతర అధికారులు పాల్గొన్నారు.


