600 కుటుంబాలకు పని
మేలురకం నారు లభ్యం
నాణ్యమైన మిర్చినారుకు చిరునామాగా ‘రెంటచింతల’ ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక రైతులు కూడా ఇక్కడికే పలు హైబ్రీడ్ రకాల కంపెనీల మిర్చినారు లభ్యం
రెంటచింతల: వేసవి కాలంలో రెంటచింతల పేరు వినని వారుండరు. భగభగమని అత్యధిక ఉష్ణోగ్రతలే కాదు.. ఇది మిర్చినారుకు కూడా ప్రసిద్ధి చెందింది. మేలురకమైన మిర్చిపంటకు కావాల్సిన నారుకు కేరాఫ్‌గా, హార్టికల్చర్ హబ్‌గా రెంటచింతల పేరు గడిస్తోంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా 54 నర్సరీలు ఏర్పాటు చేశారు. మొదట మూడు, నాలుగు నర్సరీలు ఏర్పాటు చేయగా ఉద్యాన శాఖాధికారులు అవగాహన కల్పించడంతో మూడు సంవత్సరాల్లో నర్సరీల ఏర్పాటుకు రైతులు ఉత్సాహం చూపారు.
పలు రకాల మిర్చినారు ఒకే చోట..
గతేడాది పలు రకాలకు చెందిన మొక్కలకు వేర్వేరు రేట్లు పలికాయి. ఒక మొక్కను 80 పైసలు నుంచి రూ.1.75 వరకు రైతులు కొనుగోలు చేశారు. సుమారు 200 ఎకరాల్లో షేడ్ నెట్‌లలో నర్సరీలు ఏర్పాటు చేయగా ఎకరాకు 18 వేల ట్రేల చొప్పున నారును పెంచుతున్నారు. రైతులకు ఇక్కడ పలు రకాల హైబ్రీడ్ మిర్చి నారు ఒకే చోట దొరుకుతుంది. దీంతో రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులే కాక తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, వరంగల్ తదితర జిల్లాలకు చెందిన వందలాది మంది రైతులు, కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు కూడా ఇక్కడ నర్సరీలలో పెంచిన మిర్చినారును కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కొందరు రైతులు విత్తనాలను ఇచ్చి ఒక్కొక్క ట్రేకి ఇంత నగదు అని ముందుగానే నిర్వహకులతో ఒప్పందం చేసుకుంటారు. రాష్ట్రంలోనే మిర్చి పంట సాగుకు ఈ ప్రాంతానికే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు నర్సరీల ద్వారా అనేక ప్రాంతాలకు మేలు రకాలైన మిర్చినారును సరఫరా చేసే కేంద్రంగా మారింది. పెద్ద సంఖ్యలో నర్సరీలను ఏర్పాటు చేయడం వలన మండలంలోని పలు గ్రామాలకు చెందిన వందలాది వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కూడా లభిస్తోంది.
ఈ ప్రాంతంలో సుమారు 54 నర్సరీలు ఏర్పాటు చేయడం వలన రైతులకు అవసరమైన మేలు రకమైన మిర్చినారు కచ్చితంగా దొరుకుతుంది. ఈ నమ్మకంతోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు ప్రతి ఏటా ఇక్కడకు వచ్చి మిర్చినారు కొనుగోలు చేస్తుంటారు. సుమారు 600 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నాం.
– బద్దూరి బ్రహ్మానందరెడ్డి,
నర్సరీ యజమాని
ఈ ప్రాంతంలో షేడ్ నెట్ నర్సరీల నిర్వహకులు ఎక్కువ మంది రైతులు కావడం వలన మేలు రకమైన నారు దొరుకుతుందని మాకు నమ్మకం. మా ప్రాంతంలో మిర్చినారును పెంచుకునే విధానంపై అవగాహన లేదు. ఇక్కడ ఎక్కువ నర్సరీలు ఉండటం కారణంగా రెండు, మూడు రకాల మేలు రకాలైన హైబ్రీడ్ మిర్చినారును కొనుగొలు చేసుకోవచ్చు.
– వడితే మునినాయక్, తిమ్మాయిపాలెం గ్రామం, నల్గొండ జిల్లా, తెలంగాణ


