వినుకొండ: గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ సోమవారం వినుకొండ సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీల ఆరోగ్యం, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంటగది, స్టోర్ రూమ్‌లను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని ఖైదీలకు లోక్ అదాలత్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్లు పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, కట్ట కాళిదాస్, లోక్ అదాలత్ సిబ్బంది, జైలు అధికారులు పాల్గొన్నారు.
లీకేజీ నీటిని పరిశీలించిన సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్ నుంచి నీటి విడుదల జరిగేటప్పుడు కుడి జల విద్యుత్ కేంద్రంలోకి వస్తున్న లీకేజీ వాటర్‌ను సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పి.కాంతారావు ఆధ్వర్యంలో అధికారులు సోమవారం పరిశీలించారు. గతంలో కెనాల్ బెడ్ కొట్టుకుపోవడంతో వాల్ దెబ్బతిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో నీరు పవర్ హౌస్‌లోకి లీక్ అవుతుండటంతో మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్‌కో ఎస్‌ఈ వెంకటరమణ, ఇరిగేషన్ శాఖ ఈఈ మల్లికార్జునరావు, వపర్ హౌస్ డీఈఈ రాజారెడ్డి, సాగర్ ప్రాజెక్టు డీఈఈ గోపాలరావు, ఏఈలు శివయ్య, యుగంధర్ పాల్గొన్నారు.
దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్‌గా భారతి
పెదకాకాని: రాష్ట్ర దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్ పర్సన్‌గా విశ్రాంత న్యాయమూర్తి ఎం.భారతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా కోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన భారతిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దేవదాయశాఖ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్‌గా నియమించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గుంటూరు జిల్లా పెదకాకానిలోని రాష్ట్ర దేవదాయశాఖ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ పోస్టు ఖాళీగా ఉంది. రెండేళ్ల తర్వాత ఈ పదవిలో భారతి నియమితులయ్యారు.
ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు
టెట్ మినహాయించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.థామస్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి సిద్దెల ప్రేమ్‌సాగర్ డిమాండ్ చేశారు. ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను కలెక్టరేట్‌లో కలసిన వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. విద్యాహక్కు చట్టానికి సవరణ తెచ్చి, టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం దీనిపై ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించాలన్నారు. కలెక్టర్‌ను కలసిన వారిలో సంఘ జిల్లా అధ్యక్షుడు పి.శేషిరెడ్డి ఉన్నారు.


