రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య కేసులో ఐదుగురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య కేసులో ఐదుగురు అరెస్టు

Jul 21 2026 1:36 AM | Updated on Jul 21 2026 1:36 AM

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య కేసులో ఐదుగురు అరెస్టు

నగరంపాలెం: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య కేసుని తాడికొండ పోలీసులు ఛేదించగా, ఐదుగుర్ని అరెస్టు చేసి బంగారు సొత్తు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. ఈనెల ఏడున తాడికొండ మండలం ఫణిదరానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మాడుగుల శంకరరావు (52) అదృశ్యమైనట్లు ఫిర్యాదివ్వగా తాడికొండ పీఎస్‌లో కేసు నమోదైంది. ఐదు రోజులు గడిచాక నల్లపాడు క్వారీ గుంతల్లో కుళ్లిన స్థితిలో ఓ మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులను తీసుకెళ్లగా, మృతుడు శంకరరావు అని నిర్ధారించారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా, మృతుని మొబైల్‌ లాం, వైజాగ్‌లో ఉన్నట్లు చూయించడంతో విచారణ కొనసాగించారు. మొబైల్‌ఫోన్‌ లాం గ్రామంలో చూయించగా, గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన దేవరకొండ నాగేశ్వరరావు అలియాస్‌ ఓంకార్‌, గుజ్జర్లపూడి శ్యామూల్‌ అలియాస్‌ సీమోను, కనపర్తి మణికంఠ, ఘట్టమనేని పుష్ప, దేవళ్ల పద్మను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో ఐదుగుర్ని అరెస్ట్‌ చేసి నాలుగు ఉంగరాలు, ఒక బంగారు గొలుసు, రూ.70 వేలు, కారు, మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ముందస్తు ప్లాన్‌లతో..

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య కేసులో ఏ–1 నాగేశ్వరరావుకు మిగతా నలుగురితో పరిచయం ఉంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శంకరరావుతో శ్యామూల్‌కు పరిచయం ఉంది. అతను ఆర్థికంగా స్థిరపడ్డాడని, అతన్ని బెదిరిస్తే డబ్బులు వస్తాయని శ్యామూల్‌ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో యడ్లపాడులో భూమి కొనాలని శంకరరావుని నమ్మించి, ముందస్తుగా ప్లాన్‌ వేశారు. ఈనెల ఏడు సాయంత్రం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార్ని అద్దె కారులో తీసుకెళ్లారు. వంకాయలపాడు గ్రామ సమీపాన ఐదుగురు ఏకమై, అతనిపై దాడికి పాల్పడ్డారు. కొరియా తాడుతో అతను గొంతుకి బిగించి హత్య చేశారు. అనంతరం మృతుని ఒంటిపై నాలుగు బంగారు ఉంగరాలు, బంగారు గొలుసు, రూ.72 వేలు తీసేసుకున్నారు. మృతదేహానికి సిమెంట్‌ రాయి, బైండింగ్‌ వైరు కట్టేసి పొత్తూరు పరిధిలోని క్వారీ గుంతలో పడేశారు. అక్కడ్నుంచి అందరూ పరారయ్యారు. అయితే మృతు ని మొబైల్‌ఫోన్‌ లోకేషన్‌ వైజాగ్‌, లాం గ్రామంలో చూయించగా ఆ దిశగా విచారించారు.

మరో హత్య కేసు వెలుగులోకి..

తాడికొండ పోలీసుల విచారణలో మరో యువకుడి హత్య కేసు వెలుగు చూసింది. వెంగళాయపాలెంకు చెందిన నాగరాజు, నాగేశ్వరరావు వద్ద ఉండేవాడు. నాగేశ్వరరావు కుమార్తె వేరొకరితో వెళ్లిపోయింది. అందుకు నాగరాజు సహకరించినట్లు నాగేశ్వరరావు పగ పెంచుకున్నాడు. రెండు నెలలు కిందట నాగరాజుని దారుణంగా హత్య చేశారు. అతని మృతదేహన్ని మాచర్ల సమీపాన సాగర్‌ కుడి కాలువలో పడేశారు. మాచర్ల పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. కుమారుడు అదృశ్యంపై తల్లిదండ్రులు నల్లపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇక ఏ–1 నాగేశ్వరరావుపై మహిళా పీఎస్‌, ఎకై ్సజ్‌ పీఎస్‌లో కేసులు, మణికంఠపై మూడు కేసులు, ఇద్దరు మహిళలపై చీటింగ్‌ కేసులు ఉన్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. వీరందరిపై రౌడీషీట్‌లు తెరుస్తామని చెప్పారు. నాగేశ్వరరావు, మణికంఠపై పీడీ యాక్ట్‌కు సిఫార్సు చేస్తామని అన్నారు. అదృశ్య కేసులను చేధించిన తాడికొండ పీఎస్‌ సీఐ ఆర్‌.ఉమేష్‌, ఎస్‌ఐ జేత్యనాయక్‌, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. తుళ్లూరు డీఎస్పీ టి.మురళీకృష్ణ పాల్గొన్నారు.

మిస్సింగ్‌ కేసులను ఛేదించిన తాడికొండ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement