బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (జీడీసీసీబీ) శాఖలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరును మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు నోడల్ అధికారుల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావు అధికారులను ఆదేశించారు. గుంటూరు బ్రాడీపేటలోని బ్యాంక్ పరిపాలన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నోడల్ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంక్ అభివృద్ధిలో నోడల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి నోడల్ అధికారి తమ పరిధిలోని శాఖల పనితీరు మెరుగుపడేలా అవసరమైన సూచనలు అందించడంతో పాటు లోపాలను వెంటనే గుర్తించి పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంక్‌లో 11 మంది నోడల్ అధికారులతో నోడల్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని బ్యాంక్ సీఈఓని ఆదేశించారు. బ్యాంక్ శాఖలు, సహకార సంఘాల మధ్య సమన్వయం పెంచుతూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో బ్యాంకు సీఈవో వీవీఎస్ ఫణి కుమార్, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


