యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు
గుంటూరు ఎడ్యుకేషన్: దసరా సెలవుల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) లో పలు కీలక మార్పులు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాంబశివపేటలోని ఏసీ కళాశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ తెలుగు అవగాహన తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీఎస్సీకి అనుసంధానంగా నిర్వహించే టెట్‌కు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్‌లో మార్పులు లేనట్లయితే అది స్పెషల్ టెట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్పెషల్ టెట్‌లో కామన్‌గా అందరికీ పాస్ మార్కు తగ్గింపుగా ఉండాలని, ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2ఏ పరీక్షలో ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు వరకే సిలబస్ ఉండాలని, తనవి కాని సబ్జెక్టును తొలగించాలన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు అవగాహన తరగతులు విజయవంతమయ్యాయని, మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. టెట్ అవగాహన తరగతులను నిర్వహించేందుకు సహకారం అందించిన ఏసీ కళాశాల యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. తరగతుల ముగింపు కార్యక్రమంలో తెలుగు రీసోర్స్ పర్సన్ ఆర్.వెంకటరావును సత్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టీఎస్‌ఎల్‌ఎన్ మల్లేశ్వరరావు, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, యూత్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


