‘సర్‌’పై అప్రమత్తంగా లేకుంటే ఓటు రద్దు | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’పై అప్రమత్తంగా లేకుంటే ఓటు రద్దు

Jul 11 2026 3:34 AM | Updated on Jul 11 2026 3:34 AM

తెనాలి: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్‌)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లేకుంటే ఓటు రద్దుతోపాటు పౌరసత్యాన్నీ కోల్పోయే ప్రమాదముందని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతవరపు ప్రసాద్‌ హెచ్చరించారు. తనను తాను ఓటరుగా నిరూపించుకోవాల్సిన బాధ్యతను ఎన్నికల కమిషన్‌ పౌరులపైనే బాధ్యతను ఉంచిందని చెప్పారు. దీనిపై పౌరులకు తగిన ముందస్తు అవగాహన కల్పించలేదని, సర్‌ నిబంధనలతో కొంతమందికి ఓటును నిరూపించుకోవటం కష్టసాధ్యమన్నారు. ఆదర్శనేత, ఆర్గానిక్‌ ఇంటలెక్చువల్‌ కనపర్తి ఏసురత్నం 70వ జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం స్థానిక కవిరాజు పార్కులోని వీజీకే భవన్లో ఏర్పాటైన సభకు ‘అరసం’ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కనపర్తి బెన్‌హర్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సభలో కౌతవరపు ప్రసాద్‌ ‘ఎన్నికల జాబితా సవరణ చట్టం’పై కనపర్తి ఏసురత్నం స్మారకోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ, స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) పేరిట ఎన్నికల కమిషన్‌ ఏటా ఓటరు జాబితా సవరణ చేస్తోందని గుర్తుచేశారు. చనిపోయి,బదిలీ, వలస వెళ్లినవారి ఓట్ల తొలగింపు, 18 ఏళ్లు నిండిన వారికి ఓటు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో బిహార్‌తో పలు రాష్ట్రాల్లో ‘సర్‌’ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు ఇందులోని నిబంధనలతో ఆయా రాష్ట్రాల్లో లక్షలాదిమంది ఓటు హక్కును కోల్పోయినట్టు సోదాహరణంగా చెప్పారు. ఎన్యూమరేషన్‌ ఫారాలు పూర్తిచేసి ఇస్తేనే ఓటు హక్కు వచ్చినట్టు కాదనీ, అందులోని నిబంధనల ప్రకారం లేకుంటే కంప్యూటర్‌ తిరస్కరిస్తుందని చెప్పారు. ఆయా నిబంధనలనూ వివరించారు. కేవలం ముస్లింలు, మైనారిటీల ఓట్లు పోతాయనే అపోహ ఉందని, వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో ఎస్సీలు, వలస కార్మికుల ఓట్లు, ప్రధానంగా మహిళల ఓట్లు కూడా పోయాయని తెలిపారు. దీనిపై ఓటర్లకు అవగాహన కల్పించాలనీ, స్వచ్ఛంద సంస్థలు, అభ్యుదయవాదులు సమష్టిగా అందరికీ ఓటుహక్కు లభించేలా చూడాలని సూచించారు. అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, ప్రముఖ న్యాయవాదులు జి.శివనాగేశ్వరరావు, పీపీఆర్‌వీ సాగర్‌, అంబేడ్కర్‌ సేవాట్రస్ట్‌ కోశాధికారి బండికళ్ల సతీష్‌ మాట్లాడారు. కమ్యూనిస్టుగా, హేతువాదిగా, అంబేడ్కరైట్‌గా, ‘కార్డ్స్‌’ సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌గా ప్రజాఉద్యమాలకు తోడ్పాటునందించిన కనపర్తి ఏసురత్నంను పరిపూర్ణ మానవుడుగా స్మరించుకున్నారు. అరసం, భిన్నస్వరాలు, అంబేడ్కర్‌ సేవాట్రస్ట్‌ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతవరపు ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement