ముంచేసిన ఎల్ నినో..
అడుగంటిన జలాలు
గత ఏడాది కురిసిన వర్షాలతో పెరిగిన నీటిమట్టాలే ఇప్పటివరకు జిల్లాను కాపాడుతూ వచ్చాయి. అయితే ప్రస్తుత వర్షాభావం కారణంగా జిల్లా సగటు నీటిమట్టం ఏకంగా 12.32 మీటర్లకు పడిపోయింది. గత నాలుగేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ పతనం భీతి గొలిపుతోంది.
సాక్షి, మదనపల్లె : అన్నమయ్య జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని ఎల్ నినో భూతం కరవు కోరల్లోకి నెట్టేసింది. జూన్ నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, జులైలో అసలు చినుకే రాలకపోవడంతో జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. గత కొన్నేళ్లతో పోలిస్తే నీటిమట్టాలు అత్యంత ప్రమాదకర స్థాయికి దిగజారడంతో వ్యవసాయ బోర్లతో పాటు తాగునీటి పథకాలు సైతం ఆగిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆగస్టు నాటికి జిల్లా అంతటా అన్ని రంగాలు కుదేలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
14 మండలాల్లో పాతాళానికి గంగ.. రామసముద్రం టాప్!
తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలోని 14 మండలాల్లో జలమట్టాలు దారుణంగా పడిపోయాయి. నీటిమట్టం భారీగా దిగజారుతున్న మండలాల్లో రామసముద్రం ఏకంగా 25.39 మీటర్ల (సుమారు 83 అడుగులు) లోతుతో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కలికిరి, నిమ్మనపల్లి, కలకడ, గుర్రంకొండ, గాలివీడు, పుంగనూరు, రాయచోటి, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, తంబళ్లపల్లె, వాయల్పాడు, సంబేపల్లి, కురబలకోట మండలాలు ఉన్నాయి. అయితే, జిల్లాలో కొన్ని మండలాల్లో నీటిమట్టం ఇంకా పైనే ఉంది. చౌడేపల్లిలో 1.36 మీటర్లు, లక్కిరెడ్డిపల్లెలో 2.60 మీటర్లు, పెద్దమండ్యంలో 5.86 మీటర్ల లోతులోనే నీటి లభ్యత ఉంది.
జిల్లా సగటు నీటిమట్టం 12.32 మీటర్లు
రామసముద్రంలో 25.39 మీటర్ల లోతులో
14 మండలాల్లో పాతాళంలోకి జలం
2022లో 7.46, 2023లో 6.02 మీటర్లకే నీటి లభ్యత
మున్ముందు మరింత దారుణ పరిస్థితులు
71 పల్లెల్లో ట్యాంకర్ల ద్వారా నీటి రవాణా!


