నాన్న కుస్తీ పట్టులోని బలాన్ని తన ఒంటి నిండా నింపుకున్నాడు.. అన్న అందించిన ప్రోత్సాహాన్ని గుండెల్లో దాచుకున్నాడు.. వేదిక ఏదైనా.. జట్టు ఏదైనా.. బ్యాటు చేతబట్టి గ్రౌండులో దిగితే బంతి స్టాండ్‌లోకి వెళ్లాల్సిందే.. అతని ధనాధన్ ఇన్నింగ్స్‌కి జనం ఫిదా అవ్వాల్సిందే. అతనే కడప నగరానికి చెందిన క్రికెటర్ జహీర్ అబ్బాస్
కడప వైఎస్సార్ సర్కిల్ : కడప నగరం అల్మాస్ పేటకు చెందిన జహీర్ అబ్బాస్ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. ఇటీవల జరిగిన ఏపీఎల్‌లో టోర్నీ ఆద్యంతం చక్కటి ఇన్నింగ్స్‌లతో అలరించాడు. వరుసగా రెండో ఏడాది సూపర్ స్ట్రైకర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కడపలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియంలో సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో అందరినీ ఆశ్యర్యపరిచాడు.
నాన్న బలం.. అన్న ప్రోత్సాహం
అల్మాస్‌పేటకు చెందిన షేక్ అన్సర్, షేక్ గౌసియా బేగం దంపతుల కొడుకు జహీర్ అబ్బాస్. తండ్రి కుస్తీ పహిల్వాన్. తల్లి గృహిణి. వీరి ముగ్గురు కుమారుల్లో జహీర్ మూడో వాడు. తమ్ముడిలోని క్రికెట్ నైపుణ్యం చూసిన ఇద్దరన్నలు రవూఫ్, జాఫర్ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ కోచింగ్‌కు పంపించా రు. అక్కడి సీనియర్ కోచ్ ఖాజా మెలకువలు జహీర్ లోని నైపుణ్యాన్ని సానబెట్టాయి. అలాగే కడప క్రికెట్ అసోసియేషన్ అధికారుల, సిబ్బంది అండ తోడైంది.
ఒక్కో మెట్టు ఎదుగుతూ.. కడప క్రికెట్ అసోసియేషన్‌లోని భరత్‌రెడ్డి, రెడ్డి ప్రసాద్ తదితరులు ఇచ్చిన ప్రోత్సాహంతో జహీర్ అబ్బాస్ వేగంగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చా డు. తొలుత అండర్–16స్టేట్‌కు ఆడిన జహీర్, 2019–20లో అండర్–19 స్టేట్ జట్టుకు ప్రాతి నిధ్యం వహించాడు. ఇందులో 3 అర్థ సెంచరీలతో రాణించిన జహీర్ 200 స్ట్రైక్ రేట్ కలిగి ఉండడం విశేషం. ఆ ఏడాది అండర్ –19 ప్రపంచకప్ కోసం ఇండియన్ సెలెక్టర్ల నుంచి పిలుపునందుకున్న జహీర్ గ్వాలియర్‌లో ఎంపికలకు సైతం హాజరయ్యాడు.
ఏపీఎల్‌తో వెలుగులోకి.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ జహీర్ అబ్బాస్‌లోని క్రికెట్ నైపుణ్యాన్ని ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇప్పటివరకు ఏపీఎల్ ఐదు సీజ న్లు జరగగా.. తొలి సీజన్ నుంచి ఆడుతున్న జహీర్ వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. తొలి సీజన్‌లోనే చాంపియన్ జట్టులో సభ్యుడుగా ఉండడం విశేషం. కాగా 2025లో సూపర్ స్ట్రైకర్ ఆప్ టోర్నీగా నిలిచిన జహీర్, తాజాగా జరిగిన ఐదో సీజన్‌లోనూ సూపర్ స్ట్రైకర్ అవార్డు కై వసం చేసుకున్నాడు. ఇప్పటివరకు అతి తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ ఇతని పేరుమీదే ఉండడం విశేషం.
టీం ఇండియాకు ఎంపికవడమే లక్ష్యం..
ఇండియన్ క్రికెట్ టీంకు ఎంపికవడమే తన ఆశయమని జహీర్ తెలిపాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో ప్రధాన జట్లయిన చైన్నె, కేకేఆర్‌లు ట్రయల్స్ కోసం తన పేరును రిజిస్టర్ చేసుకున్నాయని.. ఈ ఏడాది అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.


