‘నీట్‌’లో మెరిసిన దీక్షిత | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’లో మెరిసిన దీక్షిత

Jul 19 2026 1:26 AM | Updated on Jul 19 2026 1:26 AM

పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరుకు చెందిన శ్రీపురం లక్ష్మినారాయణ, కోమల దంపతుల కుమార్తె శ్రీపురం దీక్షిత నీట్‌ పరీక్షా ఫలితాల్లో సత్తా చాటింది విజయవాడలోని శ్రీ గోశాలైట్స్‌ మెడికల్‌ అకాడమీలో కోచింగ్‌ తీసుకున్న దీక్షిత శుక్రవారం వెలువడిన ఫలితాల్లో 642 మార్కులతో ఆల్‌ ఇండియా 2,080 ర్యాంకు సాధించింది. యు వతి తండ్రి చిల్లర దుకాణం నడుపుతుండగా తల్లి గృహిణిగా పని చేస్తోంది. భవిష్యత్తులో తాను డాక్టర్‌నై ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని దీక్షిత అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఏటీఎంలో చోరీకి

విఫలయత్నం

పుంగనూరు: పట్టణంలోని కొత్తయిండ్లలో గల హిటాచిమోటార్స్‌ ఏటీఎంలో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. ఏటీఎంను పగులగొట్టే ప్రయత్నం విఫలం కావడంతో ఎలాంటి నష్టం జరగలేదు. దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో క్లూస్‌టీమ్‌ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారిపై ఉన్న ఏటిఎంలో దొంగలు పడటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

టీచర్లు బోధనా సామర్థ్యాలు పెంచుకోవాలి

పీలేరు రూరల్‌ : మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సరికొత్త టెక్నాలజీతో బోధనా పద్ధతులను అలవర్చుకోవాలని జిల్లా పరీక్షల నిర్వహణ శాఖ కార్యదర్శి గంగాధరం పిలుపునిచ్చారు. శనివారం పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీలేరు డివిజన్‌ పరిధిలోని (పీలేరు, కలికిరి, కేవీపల్లె, కలకడ, సదుం, సోమల) మండలాల గణిత, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ తరగతులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం లిప్‌ యాప్‌, హోల్‌ వీల్‌ కార్డులు, విద్యార్థుల 100 రోజుల విద్యా కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓలు బాబునాయక్‌, నాగార్జున, హెచ్‌ఎంలు ప్రేమరాణి, రేణుకాదేవి, రీసోర్స్‌ పర్సన్లు శ్రీనివాసులరెడ్డి, ఆంజనేయులు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

హార్టికల్చర్‌ హబ్‌

ఏర్పాటుకు కసరత్తు

రామసముద్రం : మదనపల్లె నియోజకవర్గ పరిధిలో హార్టికల్చర్‌ హబ్‌ ఏర్పాటుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రామసముద్రం మండలంలోని చొక్కాండ్లపల్లి గ్రామ సమీపంలో, కర్ణాటక సరిహద్దులో గల సర్వే నంబర్‌ 177లోని 60 ఎకరాల ప్రభుత్వ పశువుల మేత బీడు భూమిని మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ స్థలం విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రహదారి సౌకర్యాలు మరియు మౌలిక వసతులపై రెవెన్యూ అధికారులతో కలిసి ఆమె సమగ్ర సర్వే జరిపారు. ఈ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సబ్‌ కలెక్టర్‌ తెలిపారు. ఈ హబ్‌ ఏర్పాటు ద్వారా ఉద్యానవన పంటల నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌తో పాటు రైతులకు ఆధునిక సాంకేతికత, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అజారుద్దీన్‌, ఆర్‌ఐ వసీమ్‌, సర్వేయర్‌ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement