ఆకాశమంతా మేఘాలు ముసురుకుంటున్నా.. ఎల్‌నినో రక్కసి ప్రభావంతో ఒక్క చినుకూ రాలడం లేదు. పొడి గాలుల ధాటికి భూమిలోని తేమ ఆవిరైపోతుండటంతో జిల్లాలో కరువు నీడలు కమ్ముకొస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ సగానికి వస్తున్నా ఎగువన వర్షాల్లేక జిల్లావ్యాప్తంగా సాగు పూర్తిగా ప్రశ | - | Sakshi
Sakshi News home page

ఆకాశమంతా మేఘాలు ముసురుకుంటున్నా.. ఎల్‌నినో రక్కసి ప్రభావంతో ఒక్క చినుకూ రాలడం లేదు. పొడి గాలుల ధాటికి భూమిలోని తేమ ఆవిరైపోతుండటంతో జిల్లాలో కరువు నీడలు కమ్ముకొస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ సగానికి వస్తున్నా ఎగువన వర్షాల్లేక జిల్లావ్యాప్తంగా సాగు పూర్తిగా ప్రశ

Jul 18 2026 3:47 AM | Updated on Jul 18 2026 3:47 AM

ప్రకృతి సేద్యంపై ప్రభుత్వ లెక్కలు

70శాతం నీటి ఆధారమే

సాక్షి, మదనపల్లె: జిల్లాలో ఎల్‌నినో ప్రభావం నుంచి రైతుల పంటల సాగును ప్రత్యామ్నాయం వైపు మళ్లించినట్టు ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు చెబుతున్నప్పటికీ.. వాటి వాస్తవికతపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖరీఫ్‌ వర్షాలకు ముందే ప్రీ మాన్సూన్‌ డ్రై సూయింట్‌ (పీఎండీఎస్‌) కార్యక్రమాన్ని చేపట్టారు. నేషనల్‌ మిషన్‌ ఆఫ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ పథకం ద్వారా జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టారు. మూడు నెలలపాటు ఈ పంట సాగులో ఉండి, దిగుబడి ఇవ్వాలి. జిల్లాలో ఈ ప్రకృతి సేద్యాన్ని మార్చి నుంచి చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. దీని ముఖ్యఉద్దేశ్యం ఏమంటే వర్షాలు కురిసేందుకు ముందే చిరుధాన్యాలు, పశువుల గడ్డి పెంపకం చేపడితే వర్షాలు కురిశాక ఆ పంటలను భూమిలోనే కలిపేస్తూ దుక్కులు దున్నుకునేలా దీనిని అమలు చేశారు. ప్రకృతి సేద్యానికి సంబంధించి అంకెలు బాగున్నప్పటికీ.. వాటి ఫలితాలు, ప్రయోజనం ఏమీ లేదని తెలుస్తోంది. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగం కింద 450 మంది గౌరవ వేతనంతో కమ్యూనిటీ క్యాడర్లుగా పనిచేస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ వీరికి నెలకు రూ.4,500 గౌరవ వేతనం ఇస్తోంది.

ఇదీ లక్ష్యం

జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఉండటం, వర్షాభావ పరిస్థితులు తీవ్రమైన దృష్ట్యా వ్యవసాయ భూముల్లో చిరుధాన్యాల పంటలు, పశువుల గడ్డి పెంపకానికి ప్రకృతి వ్యవసాయ విభాగం చర్యలు చేపట్టింది. దీనివల్ల వర్షం ఎప్పుడు కురిస్తే అప్పుడు ఇవి మొలకెత్తి పంటలుగా ఉపయోగపడతాయని రైతులకు అవగాహన కల్పించారు. ఇవి మొలకెత్తాక దుక్కులు దున్ని భూమిలో కలిపి వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు వివరించారు. అయితే వర్షాలే కురవనప్పుడు వీటి సాగు ప్రశ్నార్థకంగా మారింది.

50వేల కిట్లు విక్రయం

ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి అధికారులు చెబుతున్న దాన్నిబట్టి.. బయో ఇన్‌పుట్‌ రిసోర్స్‌ సెంటర్‌ ద్వారా జిల్లాలో 26 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనిద్వారా 20 నుంచి 25 రకాలు కలిగిన చిరుధాన్యాలు 15 కిలోల సంచి రూ.1,050, పది రకాలు కలిగిన వాటిని రూ.620 చొప్పున రైతులకు విక్రయించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 50 వేల కిట్లు రైతులు కొనుగోలు చేయగా వాటిని పొలాల్లో వేసినట్లు ప్రకృతి వ్యవసాయ అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ కిట్లతో 50,154 ఎకరాల్లో పశువుల గడ్డి, చిరుధాన్యాల పంటలు సాగు చేశారని చెబుతున్నారు. ఈ స్థాయిలో చిరుధాన్యాల సేకరణ, పంపిణీ వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ.. 50వేల ఎకరాల్లో వీటిని సాగు చేశారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

● జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 46,055 హెక్టార్లలో (1,15,137 ఎకరాలు) పంటలు సాగు కావాల్సి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం వల్ల జిల్లాలో ఇప్పటిదాకా కేవలం 1,970 (4,925 ఎకరాలు) హెక్టార్లకు మాత్రమే ఖరీఫ్‌ సాగు పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌కు ముందు ప్రారంభమైన ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌ (పీడీఎంఎస్‌) కార్యక్రమం ద్వారా చేపట్టిన ప్రకృతి సాగు 50,154 ఎకరాల్లో చేపట్టారంటే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అధికారులు చెబుతున్న లెక్కలకు, జిల్లాలో కనిపిస్తున్న సాగుకు స్పష్టమైన తేడా తెలుస్తోంది.

● ప్రకృతి సేద్యం ద్వారా పంటలు సాగు చేయిస్తున్నామని చెబుతున్న అధికారులు నీటి ఆధారిత పశువుల గడ్డి దిగుబడి బాగుందంటున్నారు. వర్షాధారంతో వేసిన పశువుల గడ్డి విత్తనాలు ఆశించిన మేరకు ఎదగలేదని వారే అంగీకరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పశువుల గడ్డి సాగుపై సత్ఫలితాలు లేదన్న విషయం స్పష్టం అవుతోంది. దాంతో ప్రకృతి సేద్యం అంకెల గారడీయేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

● ప్రకృతి వ్యవసాయం సాగాలంటే కనీస వర్షపాతం ఉండాలి. జూన్‌ 14 నుంచి జూలై 17 వరకు జిల్లాలో చినుకు కురవలేదు. జూలైలో 90.5 మిల్లీమీటర్లు కురవాలి. ఒక్క మిల్లీమీటర్‌ వర్షం కూడా కురవలేదు. ఈ లెక్కన చూస్తే ప్రకృతి వ్యవసాయం పండేందుకు వర్షపాతం లేకుండా ఎలా సాధ్యమవుతుంది అన్నది ముఖ్యమైన అనుమానం.

నీటి ఆధారంతో బోర్లకింద సాగుచేసిన పశువుల గడ్డి

వర్షాధారంలో సాగుచేసిన పశువుల గడ్డి

ప్రకృతి సేద్యం అంకెల్లో బాగు

జిల్లాలో 50,154 ఎకరాల్లో

సాగు చేసినట్లు లెక్క

ఈ విస్తీర్ణం ఇప్పటి ఖరీఫ్‌ సాగు కంటే అత్యధికం

అయితే గడ్డి మినహా కనిపించని పంటలు

నియోజకవర్గం రైతులు సాగు (ఎకరాల్లో)

మదసపల్లె 6,239 6,605.22

పీలేరు 8,565 8,665.08

పుంగనూరు 5,342 4,530.18

రాయచోటి 19,622 22,539.65

తంబళ్లపల్లె 7,477 7,814.02

మొత్తం 47,245 50,154

జిల్లాలో ప్రకృతి వ్యవసాయం కింద చేపట్టిన సాగులో పశువుల గడ్డి అధికం. మొత్తం సాగులో 70శాతం నీటి ఆధారంతో, 30 శాతం వర్షాధారంతో పంటలు సాగు చేయించాం. రైతులకు దీనికి ఎలాంటి ప్రోత్సాహం అందించలేదు. వర్షాధార ప్రకృతి సేద్యంలో ఫలితాలు తక్కువే. విత్తనాలు మొక్కలైతే వాటిని భూమిలోనే దున్నేస్తారు. – వెంకటమోహన్‌, ప్రకృతి సాగు జిల్లా అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement