● ఐదుగురికి గాయాలు
ముద్దనూరు: ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలో మండలంలోని చెన్నారెడ్డిపల్లె గ్రామ సమీపంలో ముందు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది.ఈ ఘటనలో నలుగురికి స్వల్పగాయాలు కాగా మరొకరిని 108 వాహనంలో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసుల సమాచారం మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గంనుంచి కడపకు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు చెన్నారెడ్డిపల్లె వద్దకు సమీపించగానే ముందువైపు గొర్రెలు రావడంతో బస్సును స్లో చేసాడు.ఇంతలో బస్సుకు వెనుకవైపు వస్తున్న లారీ బస్సును ఢీకొంది.దీంతో బస్సు వెనుకవైపు పాక్షికంగా దెబ్బతింది.బస్సులో సుమారు 67 మంది ప్రయాణికులున్నారు.ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్పగాయాలవడంతో వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్సచేయించుకుని వెళ్లిపోయారు.కమలాపురానికి చెందిన వెంకట సుబ్బరాయుడును 108 వాహనంలో జమ్మలమడుగుకు తరలించారు.లారీ డ్రైవరుపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ తాడిపత్రి నుంచి ఎర్రగుంట్లకు ప్రయాణిస్తున్నట్లు,లారీ డ్రైవరు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.
బైక్ బోల్తా: దంపతులకు ..
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్): బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా పడిన ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. నిమ్మనపల్లె మండలం, తవళం పంచాయతీ నల్లంవారిపల్లికి చెందిన రైతు సురేంద్ర వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య రెడ్డెమ్మ, కుమార్తె లావణ్య (9వ తరగతి), కుమారుడు వైష్ణవ్ (6వ తరగతి) ఉన్నారు. శనివారం సురేంద్ర తన భార్య రెడ్డెమ్మతో కలిసి వాయల్పాడు మండలం జరావారిపల్లిలోని బంధువుల ఇంటికి పని నిమిత్తం బైక్‌లో వెళ్లాడు. తిరిగి వస్తుండగా నిమ్మనపల్లె మండలం, కొండయ్యగారిపల్లి సమీపంలో బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సురేంద్ర తలకు, శరీర భాగాలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. రెడ్డెమ్మకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఇద్దరినీ నిమ్మనపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సురేంద్రను మదనపల్లె జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుదాటుతుండగా..
మదనపల్లె,: రోడ్డు దాటుతున్న తండ్రీకొడుకులను బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రంకొండ మండలం రామాపురానికి చెందిన శ్రీనివాసులు (70), ఆయన కుమారుడు వెంకటరమణ ఆదివారం బోరు పాయింట్ పెట్టడానికి నక్కలదిన్నె వద్దకు వచ్చారు.అక్కడ రోడ్డు దాటుతుండగా సాయికుమార్, అజయ్, నవీన్ అనే ముగ్గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు శ్రీనివాసులు, వెంకటరమణతో పాటు బైక్‌పై ఉన్న సాయికుమార్, అజయ్, నవీన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఐదుగురిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో యజమానికి..
మదనపల్లె టౌన్: ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటో యజమాని తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. బి.కొత్తకోట మండలం, ఉలవలవారిపల్లెకు చెందిన ఆటో యజమాని విశ్వనాథ్ (48) కొత్తకోట నుంచి ప్రయాణికులను మండలంలోని గట్టుకు చేర్చాడు.తిరగి కొత్తకోటకు ఆటోలో వస్తుండగా, మొగసాల మర్రి సమీపంలో ఆర్టీసీ బస్సు ఆటోను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో విశ్వనాథ్‌కు కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తుండగా ఆటో డ్రైవర్ పూటుగామద్యం తాగి బస్సును ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు.


