అరణ్య రోదన! | - | Sakshi
Sakshi News home page

అరణ్య రోదన!

Jul 20 2026 1:26 AM | Updated on Jul 20 2026 1:26 AM

అట్లూరు ప్రజల వేదన..

అట్లూరు మండలం తూడూరు గ్రామానికి చెందిన పల్లె లక్ష్మమ్మకు రాత్రి 10గంటల సమయంలో గుండెల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఓ వాహనంలో ఎక్కించుకుని కడప ఆస్పత్రికి బయలుదేరారు. అట్లూరు– సిద్దవటం మార్గంలోని చెక్‌పోస్టు వద్దకు రాగానే చెక్‌పోస్టు సిబ్బంది అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే ఈ టైంలో వెళ్లడానికి వీల్లేదన్నారు. అత్యవసర పరిస్థితి అని వేడుకున్నా పంపించే ప్రసక్తే లేదన్నారు. చేసేదిలేక ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అనుమతి తీసుకోవడానికి సుమారు గంట పట్టింది.. ఆపై ఆస్పత్రికి చేరే లోపు లక్ష్మమ్మ ఊపిరాగింది. ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద వృధా అయినా ఆ గంట సమయం ఆమె ప్రాణాలు మీదకు తెచ్చింది. లక్ష్మమ్మ కుటుంబానికి ఇప్పటికీ చెక్‌పోస్టు బాధ వెంటాడుతోంది. ఆ దారి వేదన.. ఇప్పటికీ అరణ్యరోదనే అయింది.

సాక్షి ప్రతినిధి కడప : సిద్దవటం–అట్లూరు మార్గంలోని ఫారెస్ట్‌ చెక్‌పోస్టు సమస్య దశాబ్దాల కాలంగా వేధిస్తోంది. అట్లూరు, బద్వేల్‌ పరిసర ప్రాంతాల ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది.అర్ధరాత్రి అపరాత్రి ఆకస్మిక ప్రమాదాలు ముంచుకొస్తే ఆ మార్గంలో అనేక వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వస్తోంది. 2013 నుంచి ఇప్పటివరకూ అనేక కుటుంబాలు ఆవేదన భరిస్తూనే ఉన్నారు.

● సిద్దవటం–అట్లూరు మధ్యలో 9కిలోమీటర్లు వన్యప్రాణులు సంచరిస్తున్న ప్రాంతంగా ఫారెస్టు యంత్రాంగం గుర్తించింది. అభయారణ్యంలో రాత్రి సమయాల్లో వన్య ప్రాణాలు సంచరిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నాయని, ఈ పరిస్థితి నిరోధించాలనే ఉద్దేశంతో గెజిట్‌ నెంబర్‌ 05/2013 అమలు చేశారు. 2013 ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో రాత్రి 9 దాటితే సిద్దవటం–అట్లూరు మార్గంలో రహదారి బంద్‌ చేస్తారు. వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంటోంది. కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించకుండా ఏళ్ల తరబడి అదే పరిస్థితి కొనసాగడం విచారకరం. వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రమైన కడపకు వచ్చే అట్లూరు మండల ప్రజలు పని జరిగినా.. జరగకున్నా రాత్రి 9 కంటే ముందే ఆ చెక్‌పోస్టు దాటేలా చూసుకోవాలి. తీరిగ్గా పనులు ముగించుకొని బయలుదేరదామనుకుంటే కడప, ఖాజీపేట, బద్వేల్‌ మీదుగా చుట్టూ తిరిగి అట్లూరు చేరుకోవాల్సి వస్తోంది.

ఎన్‌హెచ్‌–565లో అండర్‌పాస్‌ బ్రిడ్జిలు..

నెల్లూరు–వైఎస్సార్‌ జిల్లాలోని వెలుగొండను కలుపుతూ పెనుశిల లక్ష్మీనరసింహా స్వామి అభయారణ్యంగా గుర్తించారు. ఈమార్గంలో నేషనల్‌ హైవే–565గా గుర్తించారు. 8.5కిలోమీటర్లు అభయారణ్యం ప్రాంతం విస్తరించి ఉంది. నేషనల్‌హైవే రహదారికి ఏమాత్రం ఆటంకం లేకుండా, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 8.5 కిలోమీట ర్లు పొడవునా రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడం, మరో 5చోట్ల 10 అడుగుల వెడల్పు, 6 అడుగులు ఎత్తుతో అండర్‌పాస్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు అన్నీ చర్యలు చేపట్టారు. అలాంటి ఆలోచనే సిద్దవటం–అట్లూరు మార్గంలో అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

చీకట్లు పడితే సిద్దవటం–అట్లూరు మార్గంలో ప్రయాణాలు నిషిద్ధం

రాత్రి వేళ మెడికల్‌ ఎమర్జెన్సీవస్తే చావే శరణ్యమా!

నిబంధనల పేరిట ప్రజల ఆవేదనను పట్టించుకోని ఫారెస్ట్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement