చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి: దేవినేని అవినాశ్‌ | YSRCP Leaders Console Kranti Kumars Family | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి: దేవినేని అవినాశ్‌

Jun 21 2026 3:05 PM | Updated on Jun 21 2026 3:35 PM

YSRCP Leaders Console Kranti Kumars Family

విజయవాడ: క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేతల బృందం పరామర్శించింది. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావును దేవినేని అవినాశ్‌, రాయన భాగ్యలక్ష్మి, పూనూరు గౌతమ్ రెడ్డి, పోతిన మహేశ్‌,షేక్ ఆసిఫ్ పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.

నెలరోజుల క్రితం ఇదే రోజు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని దేవినేని అవినాశ్‌ చెప్పారు. ‘‘పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు ప్రభుత్వ హత్యలే. 8 ఏళ్ల క్రితం క్రాంతి కుమార్ పై కేసులున్నాయి. ఇప్పుడు క్రాంతి కుమార్ పై ఎలాంటి కేసులు లేవు. 

తండ్రి కొనిచ్చిన కారును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తమ దందాల కోసం, గంజాయి అమ్మకాల కోసం పోలీసులు వేధిస్తున్నారు. క్రాంతి కుమార్ మృతికి చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల్లో క్రాంతి కుమార్ కుటుంబం కూటమి కోసం పనిచేశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఇప్పటి వరకూ సీపీ పరామర్శించలేదు. డీజీపీ, సీపీ బయటికి రావాలి. బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. 

క్రాంతి కుమార్ ను కులం పేరుతో పోలీసులు దూషించారు. డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకూ అందరిపై కేసులు నమోదు చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులే గంజాయి అమ్ముతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించకపోతే సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు బయటికి వచ్చేవా? జగన్ కలిశాకే సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం కేసు నమోదు చేసింది. సాయికృష్ణ,క్రాంతి కుమార్ కేసులో సీబీఐ విచారణ జరిపించాలి. క్రాంతి కుమార్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది’’ అని తెలిపారు.

ఇంకెప్పుడు ఆగుతాయి?
మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... క్రాంతి కుమార్ ఆత్మహత్య చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వ హత్యలు ఇంకెప్పుడు ఆగుతాయని నిలదీశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ చనిపోయినా చంద్రబాబు, పవన్, హోంమంత్రి నోరుమెదపడం లేదని విమర్శించారు. చంపేసి సెటిల్మెంట్ చేసుకోవాలని చూడటం దుర్మార్గమని చెప్పారు. క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, లేదంటే వైసీపీ తరఫున ఉద్యమం చేస్తామని తెలిపారు.

వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడలో పోలీసులంటేనే భయపడేలా చేస్తున్నారని చెప్పారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని వైసీపీ నేత షేక్ ఆసిఫ్ చెప్పారు. క్రాంతి కుమార్,సాయికృష్ణవి ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

వైసీపీ నేత పోతిన మహేశ్‌ మాట్లాడుతూ.. పోలీసుల వేధింపుల వల్లే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కూటమి అధికారంలోకి రావాలని జనసేన పార్టీ కార్యకర్తలు, క్రాంతి కుమార్ కుటుంబం పనిచేసిందని అన్నారు. కూటమి నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement