పెళ్లయిన నెల రోజులకే మృత్యు ఒడికి.. | wife and husband ends life in anakapalle | Sakshi
Sakshi News home page

పెళ్లయిన నెల రోజులకే మృత్యు ఒడికి..

Jun 17 2025 8:32 AM | Updated on Jun 17 2025 8:32 AM

wife and husband ends life in anakapalle

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం

గాజువాక: వివాహమైన నెల రోజులకే ఒక జంట మృత్యు ఒడికి చేరింది. కాళ్ల పారాణి ఆరకముందే విధి ప్రమాదరూపంలో కబళించింది. నగరంలో సరదాగా షికారు చేసి వద్దామనుకొని బయల్దేరిన కొత్త జంట రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. గాజువాక ట్రాఫిక్‌ పోలీసులు అందించిన వివరాలివి..

కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన జొన్నాడ సాయి(27), పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన శాలిని (25) గాజువాకలోని యాపిల్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకొని నెల రోజుల కిందట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీహరిపురంలో ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ల్యాబ్‌కు సెలవు కావడంతో షికారు కోసం నగరంలోకి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ములగాడ మీదుగా పోర్టు రోడ్‌లోని మారుతీ సర్కిల్‌ వద్ద వెనుకనే వస్తున్న ఒక ట్రాలర్‌ వారిని ఢీకొని ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

 తీవ్ర గాయాలపాలైన శాలినిని షీలానగర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స ప్రారంభించే సమయానికి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు సీఐ కోటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇదే రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయిల్‌ ట్యాంకర్‌ కింద పడి ఇద్దరు నేవీ వైద్యులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.. 24 గంటల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటం.. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

Advertisement
 
Advertisement
Advertisement